మనిషి శరీరానికి ప్రాణం ఉన్నంత వరకే విలువ! ప్రాణం పోయాకా సాటి వాళ్లు వేగంగా అంతిమం సంస్కారాలు చేసేస్తారు. ఎంత బాధలో ఉన్నా.. అంతిమ సంస్కారాల గురించే ఏర్పాట్లన్నీ! మృతదేహాన్ని కనీసం ఇంట్లో కూడా పెట్టరు! ఏ చాపో, పరుపో వేసి నేల మీదే పెడతారు. ఆ తర్వాత ఆ పరుపును కూడా పడేస్తారు!
మనిషి తన నాగరికతతో పాటు… నేర్చుకున్న విషయాలివి. మృతదేహాన్ని ఖననం చేయడం, దహనం చేయడం.. ఇవన్నీ ఆయా నాగరికత, ఆయా సంస్కృతీ, సంప్రదాయాలను బట్టి జరిగేవి. మరి బ్రిటన్ రాణి మరణించి ఇప్పటికే నాలుగైదు రోజులు గడిచిపోయినా.. ఆ దేశం ఇంకా అంతిమ సంస్కారాలను పూర్తి చేయలేదు. రాణి మరణించిన నాటి నుంచి పదో రోజున ఆమె అంత్యక్రియలు జరుగుతాయట!
మరి నాగరికత విషయంలో ఎంతో అభివృద్ధి చెందిన దేశంగా పేరు పొందిన బ్రిటన్ ఇలా తమ రాజు లేదా రాణి మృతదేహాన్ని పది రోజులు పాటు పెట్టుకోవడం ఏమిటనేది ప్రశ్న! ఇన్ని రోజుల పాటు అంత్యక్రియలను నిర్వహించకపోవడం అనేది .. సదరు వ్యక్తిని బాగా ప్రేమించే వాళ్లను క్షోభలో కొనసాగింపజేయడమే అవుతుంది. మృతదేహం ఆమెను బాగా ప్రేమించే వాళ్లను చెప్పలేనంత బాధను కలిగిస్తుంది. మరి ఒక జాతి మొత్తం ఆమెను ప్రేమిస్తుందనుకుంటే.. వారందరినీ బాధలో కొనసాగింపజేయడమే కదా!
అయితే బ్రిటన్ సంప్రదాయాల ప్రకారం.. ఏ రాజును అయినా, రాణిని అయినా మరణించిన పది రోజుల తర్వాతే ఖననం చేస్తారట! ఈ పది రోజుల్లో ఏం చేస్తారు? అంటే మోనార్క్ మృత్యు వార్తను దేశమంతా చాటి చెబుతారట!
బహుశా ఇది పురాతన సంప్రదాయం కావొచ్చు. ప్రయాణ అవకాశాలు సవ్యంగా లేని కాలాల్లో.. రాజుగారు మరణించిన విషయం దేశమంతా చాటడానికి పది రోజుల సమయం పట్టేదేమో! దేశమంతా ఆ విషయాన్ని చాటింపు వేసిన తర్వాతే.. అంత్యక్రియలు నిర్వహించక తప్పదు అప్పుడు. మరి రోజులు మారిన, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు మారినా.. అంత్యక్రియలను మాత్రం పది రోజుల తర్వాతే నిర్వహించే పద్ధతిని కొనసాగిస్తున్నారక్కడ.
సంప్రదాయాలే చట్టాలుగా మారిన దేశం అది. అందుకే యుగాలు వేరైనా.. రాజ లాంఛనాలు అన్నీ పాత పద్ధతుల ప్రకారమే జరుగుతున్నట్టున్నాయి.