Advertisement

Advertisement


Home > Politics - National

అమిత్ షా త‌న‌యుడి ప‌ద‌వి నిల‌బెట్టిన మాజీ కాంగ్రెస్ నేత‌!

అమిత్ షా త‌న‌యుడి ప‌ద‌వి నిల‌బెట్టిన మాజీ కాంగ్రెస్ నేత‌!

బీజేపీ వాళ్లు బాగా కాంగ్రెస్ పై అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్ లోని నేత‌లంద‌రినీ చేర్చుకుంటారు. కాంగ్రెస్ రాజ‌కీయాల్లో త‌ల‌పండిన నేత‌లు లాయ‌ర్లుగా బీజేపీ వాళ్ల త‌ర‌ఫున వాదిస్తారు! ఈ విచిత్ర రాజ‌కీయం బీసీసీఐలో జై షా ప‌ద‌విని నిల‌బెట్టడం గ‌మ‌నార్హం!

క‌పిల్ సిబ‌ల్.. జ‌నులంద‌రికీ బాగా తెలిసిన పేరు. కేంద్ర మాజీ మంత్రి. కాంగ్రెస్ లో ద‌శాబ్దాల పాటు కీల‌క ప‌ద‌వులు అనుభ‌వించిన నేత‌. జ‌గ‌మెరిగిన లాయ‌ర్. ఢిల్లీలో ఆర్థికంగా అత్యంత ధ‌నిక కుటుంబం నుంచి వ‌చ్చిన వ్య‌క్తి. ఐఏఎస్ కు అవ‌కాశం వ‌చ్చినా, వ‌ద్ద‌నుకుని మ‌రీ లాయ‌ర్ గా స్థిర‌ప‌డ్డాడు. లాయ‌ర్ గా పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించి కాంగ్రెస్ లో చేరి..కీల‌క ప‌దవులు చేప‌ట్టాడు.

క‌ట్ చేస్తే.. ఈ మ‌ధ్య‌నే కాంగ్రెస్ కు దూరం అయ్యారీయ‌న‌. కాంగ్రెస్ కు రాజీనామా చేసి.. ఇండిపెండెంట్ అనే పేరుతో స‌మాజ్ వాదీ పార్టీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ బ‌రిలో నిలిచారు.

ఇప్పుడు క‌పిల్ ప్ర‌స్తావ‌న ఎందుకంటే.. బీసీసీఐలో సౌర‌వ్ గంగూలీ, జై షా ల ప‌ద‌వుల‌ను నిల‌బెట్టేందుకు సుప్రీం కోర్టులో వాదించింది మ‌రెవ‌రో కాదు స‌ద‌రు సిబ‌లే! ఆ మ‌ధ్య లోథా క‌మిటీ సంస్క‌ర‌ణ‌లు అమ‌ల్లోకి వ‌చ్చాయి బీసీసీఐలో. ఈ సంఘం వ్య‌వ‌హ‌రాలు భ్ర‌ష్టుప‌ట్టిన నేప‌థ్యంలో.. లోథా క‌మిటీ నియమితం అయ్యింది. బీసీసీఐలో ఉన్న ముఖ్య స‌మ‌స్య‌ల‌కు కార‌ణాల్లో ఒక‌టి.. కొంద‌రు వ్య‌క్తులు క్రికెట్ క‌మిటీల్లో ప‌ద‌వుల‌ను ప‌దే ప‌దే చేప‌ట్ట‌డం, ద‌శాబ్దాల పాటు వాటిల్లో తిష్ట వేసుకోవ‌డం అని లోథా క‌మిటీ తేల్చింది.

బీసీసీఐలో కీల‌క ప‌ద‌వుల‌ను మాజీ క్రికెట‌ర్లే చేప‌ట్టాల‌ని, వారికి కూడా దీర్ఘ‌కాలం అవ‌కాశం ఇవ్వ‌వ‌ద్ద‌ని, రాష్ట్ర క‌మిలీలో కానీ, బీసీసీఐలో కానీ వ‌ర‌స‌గా ఆరేళ్ల పాటు ప‌ద‌విని చేప‌ట్టాకా.. కొంత కూలింగ్ పీరియ‌డ్ ఇవ్వాల‌ని లోథా క‌మిటీ   సిఫార్సు చేసింది.

అయితే ఈ సంస్క‌ర‌ణ‌ల‌ను బీసీసీలో చ‌క్రం తిప్పుతున్న పెద్ద మ‌నుషుల‌కే న‌చ్చ‌లేదు! కోర్టు సూచ‌న‌తో లోథా క‌మిటీ నియ‌మితం అయ్యింది. ఆ క‌మిటీ సూచ‌న‌ల‌ను కోర్టు ఆమోదించింది. మ‌రి ఇప్పుడు అదే కోర్టుకు వెళ్లి లోథా క‌మిటీ నియ‌మాల నుంచి త‌మ‌కు మిన‌హాయింపును పొందారు సౌర‌వ్ గంగూలీ, జై షాలు. లోథా క‌మిటీ సిఫార్సుల ప్ర‌కారం.. గంగూలీ బీసీసీఐ అధ్య‌క్ష ప‌ద‌విలో ఉండేందుకు అన‌ర్హుడు. గ‌తంలో క్యాబ్ అధ్య‌క్షుడిగా మూడేళ్లు వ్య‌వ‌హరించిన గంగూలీ, బీసీసీఐ ప్రెసిడెంట్ గా మూడేళ్లు మాత్ర‌మే కొన‌సాగేందుకు అర్హుడు. 

ఇదంతా అయిపోయినా.. గంగూలీకి మిన‌హాయింపు ల‌భించింది ఇప్పుడు కోర్టు నుంచి. అలాగే గుజ‌రాత్ క్రికెట్ వ్య‌వ‌హారాల నుంచి వ‌చ్చిన అమిత్ షా త‌న‌యుడు జై షా కూడా బీసీసీఐలో రెండు ప‌ద‌వుల్లో ఉన్నారు! ఆయ‌న కూడా కూలింగ్ పీరియ‌డ్ లోకి వెళ్లాలి. అయితే మిన‌హాయింపు ల‌భించింది! కోర్టు ఈ మేర‌కు లోథా క‌మిటీ సిఫార్సుల‌ను ప‌క్క‌న పెట్టేందుకు అనుమ‌తినిచ్చింది. మ‌రి వీరి త‌ర‌ఫున అతివీర భ‌యంక‌రంగా వాదించింది క‌పిల్ సిబ‌ల్! మ‌రి రాజ‌కీయంగా బీజేపీ వ్య‌తిరేక ప‌క్ష‌మే అయినా, బీజేపీ ముఖ్య నేత తన‌యుడి త‌ర‌ఫున క‌పిల్ గ‌ట్టిగా వాదించి గెలిచారు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?