చంద్రబాబుపై సొంత పార్టీ నేతల వైఖరి ఎలా వుంటుందో వైసీపీ నేత దేవినేని అవినాష్ సంచలన కామెంట్స్ చేశారు. నిన్నటి ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ముగ్గురు వైసీపీ నేతల ఓటమి లక్ష్యమని తీర్మానించిన సంగతి తెలిసిందే. కొడాలి నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్‌లను ఎలాగైనా ఓడించి తీరుతామని టీడీపీ నేతలు శపథం చేశారు.
ఈ నేపథ్యంలో దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ వెంట్రుక కూడా వారు పీకలేరని తేల్చి చెప్పారు. నిన్న కృష్ణా జిల్లా టీడీపీ విస్తృతస్థాయి సమావేశం వేదికపై ఉన్న వాళ్లంతా చంద్రబాబును ఉదయం దేవుడంటారని, సాయంత్రం అయ్యేసరికి పచ్చిబూతులు తిడ్తారని సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. ఇందుకు తానే ప్రత్యక్ష సాక్షినన్నారు.
దేవినేని అవినాష్ టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో కొడాలి నానిపై ఆయన్ను టీడీపీ పోటీ చేయించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై టీడీపీ నేతల అంతరంగం ఏంటో ఆయనకు బాగా తెలుసు. అదే విషయాన్ని ఇవాళ బయట పెట్టారు.
గద్దె రామ్మోహన్‌రావు తన ఎదుటే చంద్రబాబును తూలనాడారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఉస్కో అంటే కొందరు టీడీపీ నేతలు మొరుగుతున్నారన్నారు. వారిలో భయం మొదలైందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఏదో చేస్తామని అంటున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.
గత ఐదేళ్లలో వారు చేయలేని అభివృద్ధి, సంక్షేమ పథకాలను తాము మూడేళ్లలో చేశామని, దానిపై బురదజల్లుడు కార్యక్రమాలకు టీడీపీ తెరలేపిందని విమర్శించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కాల్‌మనీ సెక్స్ రాకెట్ వల్ల నష్టపోయిన వాళ్లకు తమ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.
వైఎస్ జగన్‌పై అవాకులు చెవాకులు పేలితే నాయకులుగా తమ అవసరం లేకుండానే వైసీపీ కార్యకర్తలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎవరు తొడలు కొట్టి శపథాలు చేసినా తూర్పు నియోజకవర్గంలో వైసీపీ విజయాన్ని ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. తనను ఓడిస్తానని ప్రగల్భాలు పలికిన దేవినేని ఉమామహేశ్వరరావుకు మైలవరంలో దిక్కులేదన్నారు. వాళ్ల పరిస్థితి ఏంటో వారికే తెలియదన్నారు.
గద్దె రామ్మోహన్‌రావు తన తండ్రి నెహ్రూ చేతిలో రెండుసార్లు ఓడిపోయారని అవినాష్ గుర్తు చేశారు. తూర్పు నియోజకవర్గంలో 21 డివిజన్లకు గాను 14 చోట్ల తాము గెలుపొందామన్నారు. రానున్న ఎన్నికల్లో ఎవరేమిటో తేలిపోతుందన్నారు.