అయ్యన్న ఒక్కరున్నారు…చాలదా…?

ఆయన సీనియార్టీ పెద్దది. నోరు కూడా పెద్దదే. ఆయన ఒక్కసారి సౌండ్ చేశారంటే అమరావతికి అది బిగ్గరగా  వినిపించాల్సిందే. అందుకే టీడీపీ తరఫున ఒక్కరు కూడా ధాటీగా అమరావతి రాజధాని గురించి మాట్లాడడం లేదే…

ఆయన సీనియార్టీ పెద్దది. నోరు కూడా పెద్దదే. ఆయన ఒక్కసారి సౌండ్ చేశారంటే అమరావతికి అది బిగ్గరగా  వినిపించాల్సిందే. అందుకే టీడీపీ తరఫున ఒక్కరు కూడా ధాటీగా అమరావతి రాజధాని గురించి మాట్లాడడం లేదే అన్న సంశయం తమ్ముళ్లకు పట్టి పీడిస్తున్న వేళ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మీడియా ముందుకు వచ్చేసారు.

అమరావతి రాజధానికి ఉత్తరాంధ్రా మొత్తం మద్దతు ఇస్తోందని చెప్పేశారు. అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దడానికి నాటి ముఖ్యమంత్రి చన్రబాబు రూపశిల్పిగా ప్రణాళికలు రచించారని గొప్పగా చెప్పారు. వైసీపీ మాత్రం దాన్ని కాదని మూడు రాజధానులు అంటూ జనాలను మభ్యపెడుతోందని విరుచుకుపడ్డారు.

అమరావతి రాజధానే ఏపీకి ఏకైక రాజధానిగా ఉండాలని ఉంటుందని అయ్యన్న బల్లగుద్ది మరీ చెప్పారు. ఈ విషయంలో వైసీపీ కొత్త చట్టం తెస్తామని చెప్పడం అలవి కాని మాటగా ఆయన తోసిపుచ్చారు. ఇంతకీ అయ్యన్నాపాత్రుడు చెప్పేది ఏంటి అంటే విశాఖకు రాజధాని వద్దు, అమరావతి మా అందరికీ బాగా ముద్దు అని.

ఇదే ఉత్తరాంధ్రా జనాలు అంతా కోరుకుంటున్నారని ఆయన అంటున్నారు. అమరావతి నుంచి అరసవెల్లి దాకా సాగే రైతుల మాహాపాదయాత్రకు ఈ విధంగా మంచి మద్దతు ఇచ్చి అయ్యన్నపాత్రుడు మాట్లాడిన తరువాత ఇక ఎవరికైనా అడ్డేముంది. ఏ రకమైన ఇబ్బందులు కూడా ఏముంటాయి. ఒక్క అయ్యన్న చాలరా.  రైతుల మహా పాదయాత్ర ఉత్తరాంధ్రాలో విజయం అవడం ఖాయమని తమ్ముళ్ళు మురిసిపోతున్నారు.