వైఎస్ జగన్ ఏపీ సీఎం అయ్యాక కొత్త ఆలోచనలు చేసిన సంగతి అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. కొన్ని నిర్ణయాలు తొందరపాటుతో అనాలోచితంగా చేసి అవి ఇప్పుడు మెడకు చుట్టుకొని గిలగిలలాడుతున్నారు. అలా గిగిలలాడుతున్న నిర్ణయాల్లో రాజధానిగా అమరావతికి అసెంబ్లీలో పూర్తి మద్దతు ఇవ్వడం ఒకటి.
సాధారణంగా నాయకులు (అధికారంలో ఉన్నవారు ) ఓటు బ్యాంకు సంపాదించుకునే ఆలోచనతోనే నిర్ణయాలు చేస్తారు తప్ప ఒక నిర్ణయం తీసుకునే ముందు దాన్ని గురించి కూలంకషంగా స్టడీ చేయరు. సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) విషయంలో జగన్ తొందరపాటు నిర్ణయం తీసుకొని చిక్కుల్లో పడ్డారు. అధికారంలోకి వచ్చిన వారం లోగా దాన్ని రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ దాన్ని రద్దు చేయడం సాధ్యం కాదని తెలిసిన తరువాత జగన్ ముందుగా స్టడీ చేయకుండా తొందరపడి హామీ ఇచ్చారని మంత్రులు చెప్పారు.
సంక్షేమ పథకాల అమలు విషయంలోనూ ఇలాంటి పొరపాట్లు జరిగాయి. ఇక తాను అధికారంలోకి వచ్చాక అమరావతిని కాదని ఉన్నట్లుండి మూడు రాజధానులంటూ ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక జగన్ ఉద్దేశం మంచిదే కావొచ్చుకానీ ఒకసారి అమరావతికి మద్దతు ఇచ్చాక చేసిన మూడు రాజధానుల ప్రకటన టీడీపీ మీద పగ సాధించినట్లు ఉంది కానీ ఈ ప్రకటన వల్ల ఎదురయ్యే పర్యవసానాలు ఆలోచించలేదు. ఫలితంగా న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. ప్రాంతీయ వైషమ్యాలకు మార్గం వేసినట్లు అయింది. ఏపీ ప్రభుత్వం 2020 నుంచి కూడా మూడు రాజధానుల ఊసు ఎత్తుకుంది.
అసెంబ్లీ వేదికగానే మూడు రాజధానుల ప్రస్తావన చేసిన జగన్.. అమరావతిని కేవలం శాసన రాజధానిగానే ఉంచుతామన్నారు. ఇక, దీనిపై న్యాయ వివాదాలు ముసురుకున్నాయి. రైతులు ఉద్యమం చేశారు. పాదయాత్ర చేశారు.. ప్రస్తుతం కూడా చేస్తున్నారు. అయితే.. ఇంత జరిగినా.. ఏపీ ప్రభుత్వం మాత్రం తాను మూడు నుంచి వెనక్కి తగ్గే దేలేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఇప్పుడు కూడా ఇదే మాట వినిపిస్తోంది. ఇటీవల హైకోర్టు అమరావతినే రాజధాని చేయాలని.. రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేసి తీరాలని కూడా స్పష్టం చేసిం ది. దీనికి మూడు మాసాల సమయం ఇచ్చింది. అయితే.. ఇది దాటిపోయింది.
అయినా కూడా జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామనే చెప్పుకొచ్చారు. ఇక, రేపోమాపో.. సీఎం జగన్.. విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభిస్తారని కూడా కొందరు నాయకులు క్లూ ఇస్తున్నారు. సో.. ఈ పరిణామాలను బట్టి.. మూడు రాజధానుల ప్రక్రియ… జగన్ హయాంలో ఈ రెండేళ్ల కాలంలోనే జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. వర్షాకాల సమావేశాల్లో మళ్ళీ మూడు రాజధానుల బిల్లు పెడతామంటున్నారు. ఈసారి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చూస్తామంటున్నారు. సుప్రీం కోర్టుకు కూడా వెళతామంటున్నారు. సరే…ఇదెలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
ఇలా ఉండగా, మేధావిగా, సర్వీసులో ఉన్న కాలంలో నిజాయితీపరుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నమాజీ ఐఏఎస్ అధికారి, లోక్ సత్తా అనే పార్టీని స్థాపించి ఒకసారి ఎమ్మెల్యే కూడా అయిన డాక్టర్ జయప్రకాష్ నారాయణ జగన్ మూడు రాజధానుల ఆలోచనను పూర్తిగా సమర్ధించారు. ప్రస్తుతం అమరావతి రైతుల పాదయాత్ర నేపథ్యంలో మూడు రాజధానులను ఎందుకు సమర్ధిస్తున్నాడో వివరించారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. రియల్ ఎస్టేట్ అనే ఓ మేనియాను సృష్టించారని, వేలంవెర్రిగా రేట్లను పెంచి అదే అభివృద్ధి అంటే సరిపోదని అన్నారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధిని రాష్ట్రాభివృద్ధిగా చూపిస్తే- వాపును చూసి బలుపుగా భావించినట్టవుతుందని ఎద్దేవా చేశారు.
అభివృద్ధి అంతా ఒక్క రాజధాని చుట్టే ఉండాలనుకోవడం దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బ తీస్తుందని అన్నారు. అభివృద్ధి పేరుతో భూమి రేట్లను పెంచే ప్రయత్నం ఇదివరకు అమరావతిలో జరిగిందని గుర్తు చేశారు. భూమిని కొనడానికే అయిదు నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు చేయ్యాల్సిన పరిస్థితి వస్తే.. చిన్న తరహా పరిశ్రమలను నెలకొల్పాలనుకునే పారిశ్రామికవేత్తలు ఇక వాటిని ఎలా నడిపిస్తారని జయప్రకాష్ నారాయణ ప్రశ్నించారు. రాజధాని చుట్టే అన్నీ ఉండాలి.. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులన్నీ ఒకే చోట కూడబెట్టాలనుకునే ఆలోచన ఏ మాత్రం మంచిది కాదని స్పష్టం చేశారు.
అలాంటప్పుడు వికేంద్రీకరణే సరైన నిర్ణయమని అన్నారు. అధికార యంత్రాంగాన్నీ, కోట్ల రూపాయల పెట్టుబడులను రాజధాని పేరుతో ఒకే చోట చేర్చడం రాష్ట్ర ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బ తీస్తుందని స్పష్టం చేశారు. ఇది చాలా ప్రమాదకరమైన విధానమని చెప్పారు. అధికార వికేంద్రీకరణ, ఆర్థిక వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనికి మూడు రాజధానుల ప్రతిపాదనలు సరైన నిర్ణయంగా భావిస్తున్నానని చెప్పారు.
తీరం ఎక్కడ ఉంటే అక్కడే అభివృద్ధి సాధ్యమని, పారిశ్రామికీకరణ అలాంటి చోటే శరవేగంగా అభివృద్ధి చెందుతుందని జయప్రకాష్ నారాయణ అన్నారు. గతంలో అలాంటి పొరపాటు చేయడం వల్లే విభజన తరువాత ఏపీ తీవ్రంగా నష్టపోయిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి చోటు చేసుకుందని, ఫలితంగా మిగిలిన రాష్ట్రాలు వెనుకపడ్డాయని అన్నారు. మళ్లీ అలాంటి పొరపాటే అమరావతి విషయంలో జరగాలనుకోవడం సరైంది కాదని పేర్కొన్నారు. మొత్తం మీద జగన్ ఆలోచనకు మేధావి సమర్ధన తోడైంది.