తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య నిత్యం ఏదో ఒక రచ్చ జరుగుతూనే వుంది. కాంగ్రెస్ బలహీన పడడంతో తనకూ ఎదురే లేదని సంబరపడిన టీఆర్ఎస్‌కి, బీజేపీ రూపంలో బలమైన ప్రత్యామ్నాయం కనిపించింది.
కేంద్రంలో బీజేపీ అధికారం చెలాయిస్తుండ డంతో ఆ పార్టీ తెలంగాణలో బలోపేతం కావడానికి అనుకూలమైంది. ఈ నేపథ్యంలో ఒకరి పనులు మరొకరికి ఏ మాత్రం నచ్చడం లేదు. మంచి చేసినా ప్రత్యర్థులకు మరో రకంగా కనిపిస్తోంది.
సీతాఫల్ మండీ రైల్వేస్టేషన్‌లో మూడు ఎలివేటర్లను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించడంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలను సంధించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా కిషన్‌రెడ్డిపై తన మార్క్ పంచ్‌లు విసిరారు.
“బీజేపీ ఎంపీ తన సొంత నియోజకవర్గానికి చేసిన గొప్ప పని ఎలివేటర్లను ప్రారంభించడమే. కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చిన కిషనన్నా వెల్‌డన్” అంటూ తనదైన శైలిలో వెటకారం చేయడం గమనార్హం. కేంద్రమంత్రిగా ఉండి, ఎలివేటర్లు లాంటి చిన్నచిన్న పనులు చేయడం ఏంటని పరోక్షంగా కేటీఆర్ తప్పు పట్టారు. కిషన్‌రెడ్డి దృష్టిలో ఇదే పెద్ద ప్రాజెక్ట్‌గా ఆయన తప్పు పట్టారు. కేటీఆర్ వ్యంగ్యంపై కిషన్‌రెడ్డి స్పందన ఏంటో మరి!