టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని వైసీపీ ప్రజాప్రతినిధులు రెచ్చగొడుతున్నారు. ఎలాగైనా ఆయన శపథానికి భంగం కలిగించాలనే తాపత్రయం అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్లో కనిపిస్తోంది. అందుకే ఆయనకు సవాళ్లు విసురుతు న్నారు. చట్టసభలో తన భార్యను అవమానించారని, తిరిగి ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానని చంద్రబాబు శపథం చేసి, మరీ బహిష్కరించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అసెంబ్లీకి వస్తే..చర్చిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి, చర్చల్లో పాల్గొనాలని సవాల్ విసిరారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదన్నారు. బలహీనవర్గాలకు స్థానం లేని రాజధాని ఎవరి కోసమని ఆయన నిలదీశారు. టీడీపీ హయాంలో అమరావతిలోని 29 గ్రామాలకు ఏం మేలు జరిగిందో చెప్పేందుకైనా చంద్రబాబు అసెంబ్లీకి రావాలని ఆయన డిమాండ్ చేశారు.
విజయవాడ, గుంటూరు వాసులకు ఇళ్ల స్థలాలు ఇస్తే ఎందుకు అడ్డుకున్నారని ఆయన ప్రశ్నించారు. సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అన్నప్పుడు ఈ మద్దతు పలుకుతున్న పార్టీలు ఏమయ్యాయని పార్థసారథి నిలదీశారు. తన రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిందే అమరావతి రాజధాని అని ఆయన విరుచుకుపడ్డారు.చంద్రబాబుకు దమ్ముంటే ఈ అంశాలపై అసెంబ్లీకి వచ్చి చర్చించాలని డిమాండ్ చేశారు.
అధికార పార్టీ నేతలు ఎంత రెచ్చగొట్టినా, చంద్రబాబు మాత్రం స్పందించడం లేదు. తనకేది అవసరమో అదే మాట్లాడుతున్నారు. అసెంబ్లీకి చంద్రబాబు వెళ్లే ప్రశ్నే ఉత్పన్నం కాదని టీడీపీ నాయకులు చెబుతున్నారు. చంద్రబాబు శపథానికి భంగం కలిగించాలనే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎత్తుగడలు ఫలించవని వారు చెబుతున్నారు. చంద్రబాబు అసెంబ్లీకి వెళితే అవమానించాలనేది అధికార పార్టీ వ్యూహంగా టీడీపీ నేతలు అంటున్నారు.