మరో గొంతు మూగబోయింది.. కేకే ఇకలేరు

సింగింగ్ సెన్సేషన్, దేశం మెచ్చిన గాయకుడు కేకే ఇక లేరు. తన గాత్రంతో కోట్లాది మంది శ్రోతల్ని ఉర్రూతలూగించిన ఈ గాయకుడు, హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. Advertisement నిన్న రాత్రి…

సింగింగ్ సెన్సేషన్, దేశం మెచ్చిన గాయకుడు కేకే ఇక లేరు. తన గాత్రంతో కోట్లాది మంది శ్రోతల్ని ఉర్రూతలూగించిన ఈ గాయకుడు, హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు.

నిన్న రాత్రి కోల్ కతాలోని నజ్రుల్ మంచా వివేకానంద కాలేజ్ లో జరిగిన స్టేజ్ షో లో పాల్గొన్నారు కేకే. తన పాటలతో అందర్నీ అలరించారు. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. అలా దాదాపు గంటన్నర పాటు ప్రదర్శన ఇచ్చిన తర్వాత ది గ్రాండ్ హోటల్ కు చేరుకున్నారు. ఆ వెంటనే కుప్పకూలిపోయారు.

కేకే కుప్పకూలిన వెంటనే ఆయన వ్యక్తిగత సహాయకులు, నిర్వహకులు అతడ్ని హుటాహుటిన దగ్గర్లోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. కన్నుమూయడానికి కొన్ని నిమిషాల ముందు, కేకే తన ప్రదర్శనకు సంబంధించిన ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

కేకే పూర్తి పేరు కృష్ణకుమార్ కున్నాత్. ఢిల్లీలో సెటిలైన మలయాళీ దంపతులకు 1968లో జన్మించారు కేకే. ఢిల్లీలోనే చదువుకున్న కేకే, కెరీర్ నిమిత్తం ముంబయికి మారారు. కొన్ని వేల వాణిజ్య ప్రకటనలకు జింగిల్స్ పాడారు. అదే టైమ్ లో సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తో పరిచయం ఏర్పడింది. కేకేలో టాలెంట్ ను గుర్తించిన రెహ్మాన్, అతడికి అవకాశాలిచ్చారు. అలా సినిమాల్లోకి ఎంటరైన కేకే, మళ్లీ వెనుతిరిగి చూడలేదు.

హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాళీ, అస్సామీ భాషల్లో వేల పాటలు వాడారు. తెలుగులో కేకే పాడిన పాటలన్నీ దాదాపు సూపర్ హిట్టయ్యాయి. ఒక టైమ్ లో కేకే పాట పాడితే సినిమా హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉండేది. అలా మహేష్ బాబు, చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి ఎంతోమంది హీరోల చిత్రాల్లో కేకే పాటలు పాడారు. తెలుగులో పాటలు పాడడం స్టార్ట్ చేసిన కొత్తలో, ఆయన గాత్రం విని కేకేను తెలుగువాడు అనుకునేవారు చాలామంది. ఆయన పాటలో అంత స్పష్టత కనిపించేది. ఇక హిందీలో ఆయన పాడిన పాటల్లో కొన్ని ఆల్ టైమ్ క్లాసిక్స్ ఉన్నాయి.

రెండు దశాబ్దాలకు పైగా ఆయన పాటలు పాడుతూనే ఉన్నారు. ఎక్కడ పాడుతున్నాను, ఏ సినిమా కోసం పాడుతున్నాననేది తనకు ముఖ్యం కాదని.. ప్రతి రోజూ పాడుతున్నానా లేదా అనేది మాత్రమే తనకు ముఖ్యమని, పాటే తనకు ప్రాణమని ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు కేకే. ఆయన చెప్పినట్టుగానే తుదిశ్వాస వరకు పాటలు పాడుతూనే ఉన్నారు. కేకే మరణం భారతీయ సినీ సంగీతానికి తీరని లోటు.