జ‌గ‌న్‌ను మోస‌గించిన మాజీ ఎంపీ జైలుపాలు

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను మోస‌గించిన మాజీ ఎంపీ, మ‌హిళా నాయ‌కురాలు కొత్త‌ప‌ల్లి గీత అరెస్ట్ అయ్యారు. అయితే బ్యాంక్ నుంచి భారీ మొత్తంలో లోన్ తీసుకుని, తిరిగి చెల్లించ‌కుండా త‌ప్పించుకుని తిరుగుతున్న ఆమె చివ‌రికి…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను మోస‌గించిన మాజీ ఎంపీ, మ‌హిళా నాయ‌కురాలు కొత్త‌ప‌ల్లి గీత అరెస్ట్ అయ్యారు. అయితే బ్యాంక్ నుంచి భారీ మొత్తంలో లోన్ తీసుకుని, తిరిగి చెల్లించ‌కుండా త‌ప్పించుకుని తిరుగుతున్న ఆమె చివ‌రికి క‌ట‌క‌టాల‌పాలు కావాల్సి వ‌చ్చింది.  2014లో అర‌కు టికెట్ ఇచ్చి, ఎంపీగా గెలిపించిన అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ‌కు పంపామ‌నే కృత‌జ్ఞ‌త లేకుండా గీత వ్య‌వ‌హ‌రించినందుకు… ఇప్పుడు త‌గిన మూల్యం చెల్లించుకుంటున్నార‌ని వైసీపీ శ్రేణులు అంటున్నారు.

మాజీ ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత‌కు సీబీఐ కోర్టులో ఎదురు దెబ్బ త‌గిలింది. బ్యాంక్‌ను మోస‌గించిన కేసులో ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష‌, రూ.ల‌క్ష జ‌రిమానా విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇదే తీర్పు గీత భ‌ర్త రామ‌కోటేశ్వ‌ర‌రావు, బ్యాంక్ అధికారులు బీకే జ‌య‌ప్ర‌కాశ‌న్‌, కేకే అర‌విందాక్ష‌న్‌కు శిక్ష విధించింది.

పంజాబ్‌ నేష‌న‌ల్ బ్యాంక్ నుంచి ఓ సంస్థ పేరుతో ఆమె రూ.52 కోట్ల రుణం తీసుకున్నారు. ఎంత‌కూ ఆమె చెల్లించ‌లేదు. దీంతో బ్యాంక్ అధికారులు ప‌లుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించ‌లేదు. ఈ నేప‌థ్యంలో సీబీఐ అధికారులు ఆమెను హైద‌రాబాద్‌లో అరెస్ట్ చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. అరెస్ట్ అనంత‌రం ఆమెను వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఉస్మానియాకు త‌ర‌లించారు. ఆ త‌ర్వాత గీత‌ను చంచల్‌గూడ జైలుకు త‌రలించారు. బెయిల్ కోసం తెలంగాణ న్యాయ‌వాదులు పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

ఇదిలా వుండ‌గా కొత్తప‌ల్లి గీత అరెస్ట్ నేప‌థ్యంలో వైసీపీ నేత‌లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. గ‌తంలో వైసీపీ త‌ర‌పున గెలుపొంది టీడీపీ, బీజేపీ పంచ‌న చేరార‌ని గుర్తు చేస్తున్నారు. జ‌గ‌న్‌పై అవాకులు చెవాకులు పేలార‌ని అంటున్నారు. న‌మ్మ‌కం ద్రోహం చేసిన గీత‌కు త‌గిన శిక్ష ప‌డింద‌ని అంటున్నారు.