2022 సంక్రాంతి సినిమాల పోటీ పెరుగుతోంది. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా డేట్ తో సహా ప్రకటించేసారు. కానీ చాలా కాలం కిందటే తమ సినిమా 2022 సంక్రాంతికే అని మహేష్ బాబు సర్కారు వారి పాట యూనిట్ ప్రకటించేసి వుంది.
ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ రీమేక్ కూడా సంక్రాంతికే విడుదల అని ప్రకటించేసారు. నిన్నటికి నిన్న హీరో వెంకటేష్ తమ ఎఫ్ 3 సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతుందని ప్రకటించారు.
ఇలాంటి నేపథ్యంలో మహేష్ సర్కారువారి పాట కూడా పక్కా డేట్ ను ప్రకటించబోతోంది. జనవరి 13న విడుదల అని అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. అంటే రాధేశ్యామ్, సర్కారువారి పాట డేట్ లు వచ్చేసినట్లు అవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమా, ఎఫ్ 3 సినిమాల డేట్ లు రావాల్సి వుంది.
పవన్ కళ్యాణ్ సినిమా సంక్రాంతికి పక్కా అని, అయితే డేట్ మాత్రం ఈ తేదీలకు వారం ముందు కానీ వెనుక కానీ వుంటుందని తెలుస్తోంది. ఏటా 13,14,15 తేదీల్లో సినిమాలు రావడం అన్నది ఏటా అలవాటు. ఈ సారి కూడా అలాగే వుండే అవకాశం వుంది. కానీ ఈసారి అన్నీ భారీ సినిమాలే వుంటాయి.