వకీల్ సాబ్ రేటింగ్ వచ్చినప్పట్నుంచి సోషల్ మీడియాలో ఒకటే హంగామా. పవన్ కల్యాణ్ కమ్ బ్యాక్ మూవీ ఆశించిన స్థాయిలో టీవీల్లో మెప్పించలేకపోయిందనే చర్చ. అల్లు అర్జున్, మహేష్ బాబు సినిమాల్ని కొట్టలేకపోయిందంటూ వాదన.
నిజమే.. బన్నీ నటించిన అల వైకుంటపురములో, మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలతో పోలిస్తే.. వకీల్ సాబ్ టీఆర్పీ తక్కువే. అయితే అంతమాత్రానికే ఇది పవన్ ఫెయిల్యూర్ అనడం కరెక్ట్ కాదు.
కాస్త లాజికల్ గా ఆలోచిద్దాం.. ఇదే వకీల్ సాబ్ సినిమాను స్టార్ మా ఛానెల్ లేదా జెమినీలో ప్రసారం చేసి ఉంటే కచ్చితంగా రేటింగ్ 20 దాటేది. అంతేకాదు.. సరిలేరు నీకెవ్వరు టీఆర్పీని కూడా కొట్టి ఉండేదేమో. ఎందుకంటే.. అది పవన్ కల్యాణ్ ఎఫెక్ట్ మాత్రమే కాదు, ఛానెల్ ప్రభావం కూడా ఉంటుంది.
స్టార్ మా ఛానెల్ తో పోల్చి చూస్తే.. జీ తెలుగు ఛానెల్ కు తెలుగు రాష్ట్రాల్లో రీచ్ కాస్త తక్కువ. మరీ ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లోని చాలా ఊళ్లలో జీ తెలుగు ఛానెల్ రాదు. ఇక అర్బన్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న లాబీయింగ్ వల్ల జీ తెలుగు ఛానెల్ కు ప్రాధాన్యం దక్కట్లేదు. ఇదంతా బహిరంగ రహస్యం. ఇంకా చెప్పాలంటే అదంతా ఓ పెద్ద సముద్రం, ఓ చిన్న మాఫియా కూడా.
అలాంటప్పుడు జీ తెలుగు ఛానెల్ లో వకీల్ సాబ్ ను ప్రసారం చేసి అల వైకుంఠపురములో రేటింగ్ ను కొట్టడం సాధ్యమా..? కచ్చితంగా సాధ్యం కాదు.
ఓ పెద్ద సినిమాను రిలీజ్ చేయాలనుకున్నప్పుడు మెయిన్ సెంటర్ల కోసం హీరోలు-నిర్మాతలు ఎందుకు పట్టుబడతారు? ఎందుకంటే, ఆ సెంటర్లు కీలకం కాబట్టి. అక్కడ సినిమా పడితే రెవెన్యూకు, టాక్ కు ఢోకా ఉండదు కాబట్టి. కొంతమంది హీరోలైతే కొన్ని సెంటర్లను ప్రతిష్టాత్మకంగా కూడా ఫీల్ అవుతుంటారు. అది వేరే విషయం. సరిగ్గా టీవీల విషయంలో కూడా ఇదే లాజిక్ వర్తిస్తుంది.
స్టార్ మా, జెమినీ ఛానెల్స్ లో పడితే ఓ సినిమాకు ఆటోమేటిగ్గా రేంజ్ పెరుగుతుంది. అదే సమయంలో జీ తెలుగు ఛానెల్ లో ప్రసారమైతే రేటింగ్స్ పరంగా స్వల్ప తేడా ఉంటుంది. ఈ చిన్న లాజిక్ ను మరిచి, ఇదేదో పవన్ కల్యాణ్ ఫెయిల్యూర్ అన్నట్టు సోషల్ మీడియాలో కొందరు విమర్శలు చేస్తున్నారు. పవన్ కంటే బన్నీ, మహేష్ గొప్ప అంటున్నారు.