ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం అనేది దాదాపు అసాధ్యం అనుకున్నారంతా. అవును, నిజమే. ప్రాంతీయ పార్టీల అవసరం లేకుండా కేంద్రంలో బీజేపీ చక్రం తిప్పినన్ని రోజులూ అది అసాధ్యమే. కానీ రోజులు మారుతున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రాభవం తగ్గుతోంది.
కరోనా నివారణ చర్యలు, టీకా సరఫరా, పెట్రోలియం ఉత్పత్తుల వాయింపుడు దగ్గర్నుంచి, పెగాసస్ స్కామ్ వరకు.. అన్నీ కేంద్రానికి ప్రతికూల అంశాలుగా మారుతున్నాయి. 2024 ఎన్నికల నాటికి ఈ వ్యతిరేకత ఇంకా పెరిగి, బీజేపీ దిక్కుతోచని పరిస్థితుల్లో పడే ప్రమాదం ఉంది. దాన్ని ఎదుర్కోవాలంటే కచ్చితంగా ఆ పార్టీకి వైసీపీలాంటి తటస్థ పార్టీల మద్దతు అవసరం.
ఆ అవసరమే మనకు అవకాశం. అవును, బీజేపీ అవసరాన్ని గమనించి, ప్రత్యేక హోదాని సాధించుకోవడం జగన్ ముందున్న తక్షణ కర్తవ్యం.
తగినన్ని ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నారు జగన్. ప్రజలు ఈ మాట నమ్మారు. 25 స్థానాల్లో 22చోట్ల వైసీపీ కనీవినీ ఎరుగని విజయం సాధించింది. కానీ కేంద్రంలో బీజేపీ మరింత బలపడటంతో.. వైసీపీ అవసరం లేకుండా పోయింది, మెడలు వంచడం కాదు కదా, కనీసం డిమాండ్ చేయడం కూడా కాదు, బతిమిలాడే అవకాశం కూడా వైసీపీకి లేకుండా పోయింది.
పోనీ పార్లమెంట్ లో పాత వాగ్దానాలను గుర్తు చేస్తూ రచ్చ చేయాలనుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్లకార్డులు పట్టుకొని వెల్ లోకి దూసుకెళ్లినా కనీసం చర్చ కూడా జరపడం లేదు. సరిగ్గా ఇదే సమయంలో ప్రతిపక్షాల కూటమి మోదీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కాంగ్రెస్ మూడో ప్రత్యామ్నాయానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లాంటి వారు కలిసొస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ అందరినీ ఓ చోటకు చేరుస్తున్నారు.
ఈ దశలో 22 ఎంపీ సీట్లున్న జగన్ ని కూడా తమవైపు లాక్కోవాలని చూస్తోంది మూడో కూటమి. కాంగ్రెస్ ఉన్న చోటకి జగన్ ఎప్పటికీ వెళ్లరనేది బహిరంగ రహస్యమే. అయితే బీజేపీకి కూడా ఆయన సమ దూరం పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కోసం మమతా బెనర్జీ కాస్త గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.
బీజేపీకి అవసరం.. జగన్ కి అవకాశం..
వచ్చే ఎన్నికలనాటికి బీజేపీకి జగన్ అవసరం బాగా ఉంది. ఆ సంకేతాలు ఇప్పట్నుంచే కనిపిస్తున్నాయి కూడా. అంటే జగన్ ని ఇప్పటినుంచే మచ్చిక చేసుకోవడం బీజేపీకి అవసరం. ఇలాంటి టైమ్ లో జగన్, బీజేపీ ముందు ప్రత్యేక హోదా డిమాండ్ పెట్టొచ్చు.
హోదాపై బీజేపీతో అనుకూల ప్రకటన చేయించి, అప్పుడు బేషరతుగా తన మద్దతు ప్రకటించొచ్చు. అదే జరిగితే జగన్ ఏపీకి దేవుడే. చంద్రబాబు ఎన్ని నక్కజిత్తులు వేసినా.. మరో పాతికేళ్లు అధికారం వైసీపీదే. పనిలోపనిగా ఏపీలో బీజేపీకి కూడా చోటు దక్కుతుంది.