తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు తన సత్తా ఏంటో చూపాలని తహతహలాడుతున్న మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పాదయాత్రకు బ్రేక్ పడింది. అయితే ఇది తాత్కాలికమే. ఎందుకంటే ఆయన అనారోగ్యంతో బాధ పడుతూ ఆస్పత్రి పాలయ్యారు.
ఈ నెల 19న హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం నుంచి ‘ప్రజా దీవెన యాత్ర’ను ఈటల ప్రారంభించారు. ఇందులో భాగంగా 12వ రోజు ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గంలోని పోతిరెడ్డిపల్లి, కొండపాక గ్రామాల్లో ఆయన శుక్రవారం పాదయాత్ర చేశారు. వీణవంక మండలం కొండపాక వద్ద ఈటల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
ఇక అడుగులు ముందుకు పడని పరిస్థితిలో పాదయాత్రను కొండపాకలో నిలిపివేశారు. వైద్యులొచ్చి పరీక్షలు చేయగా జ్వరం వచ్చినట్లు నిర్ధారించారు. ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోవడంతో వెంటనే పాదయాత్ర నిలిపివేసి హైదరాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. డాక్టర్ల సలహా మేరకు ఈటలను హైదరాబాద్ తరలించారు. ఈటల అనారోగ్యం పాలవడంతో పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఈటల ట్వీట్ చేశారు. 12 రోజులుగా, 222 కిలోమీటర్లకు పైగా ప్రజా దీవెన యాత్ర సాగిందని పేర్కొన్నారు. తన వెంట నడిచిన, నిలిచిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనమని తెలిపారు. వేయాల్సిన అడుగులు, చేరాల్సిన ఊళ్లు చాలా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
అనారోగ్య కారణాలతో ప్రజాదీవెన యాత్రని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యం కుదుట పడగానే ప్రజా దీవెన యాత్ర మళ్లీ పునఃప్రారంభం అవుతుందని ట్విటర్ వేదికగా ఆయన వెల్లడించారు.