సాగ‌ర క‌న్య‌కు చుక్కెదురు

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టికి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. ప‌రువు న‌ష్టం కేసు విష‌యంలో శిల్పాశెట్టికి న్యాయ‌స్థానం గ‌ట్టిగా హిత‌వు చెప్పింది. అలాగే మీడియా స్వేచ్ఛ‌ను అడ్డుకోలేమ‌ని న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. దేశ వ్యాప్తంగా…

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టికి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. ప‌రువు న‌ష్టం కేసు విష‌యంలో శిల్పాశెట్టికి న్యాయ‌స్థానం గ‌ట్టిగా హిత‌వు చెప్పింది. అలాగే మీడియా స్వేచ్ఛ‌ను అడ్డుకోలేమ‌ని న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన శిల్పాశెట్టి భ‌ర్త రాజ్‌కుంద్రా అశ్లీల చిత్రాల వ్య‌వ‌హారం చివ‌రికి శిల్పాశెట్టి న్యాయ‌స్థానం మెట్లు ఎక్కింది. 

మీడియాలో క‌థ‌నాల‌ను అడ్డుకోలేమ‌ని న్యాయ‌స్థానం తేల్చి చెప్పింది. ఈ కేసుకు సంబంధించి శిల్పాశెట్టిని కూడా ముంబై పోలీసులు విచారించారు. శిల్ప- రాజ్‌కుంద్రా దంపతుల వ్యవహారంపై సోష‌ల్ మీడియా, వివిధ ప్ర‌సార మాధ్య‌మాల్లో పెద్ద ఎత్తున వ్య‌తిరేక క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.  

తమ పరువుకు భంగం కలిగించేలా మీడియా వ్యవహరిస్తోందని శిల్పాశెట్టి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. పలు మీడియా సంస్థలు, ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో తమ గురించి ప్రచురితమవుతున్న కథనాలను అడ్డుకోవాలని కోరుతూ… ఆమె పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిష‌న్  శుక్రవారం విచారణకు వచ్చింది. శిల్పా శెట్టి తరఫు న్యాయవాది బీరేన్‌ సరాఫ్‌ మాట్లాడుతూ.. భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణ గురించి కూడా మీడియాలో రాయడం సరికాదని వాదించారు.  

జస్టిస్‌ గౌతం పటేల్ స్పందిస్తూ పోలీసులు చెప్పిన వివరాల గురించి ప్రసారం చేయడం పరువుకు నష్టం కలిగించినట్లు కాదని స్ప‌ష్టం చేశారు. ప్రతి అంశాన్ని అడ్డుకోవాలంటే అది పత్రికా స్వేచ్ఛ మీద తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. శిల్పాశెట్టి భావోద్వేగానికి లోనుకావడం వంటి విషయాలు పోలీసుల ఎదుటే జరిగాయ‌న్నారు. క్రైం బ్రాంచ్‌ వర్గాలు చెప్పిన వివరాల ఆధారంగా మీడియా రిపోర్టులు వచ్చాయని జ‌స్టిస్ గౌతం ప‌టేల్ అన్నారు.

‘మీరు(శిల్పాశెట్టిని ఉద్దేశించి) పబ్లిక్‌ లైఫ్‌ను ఎంచుకున్నారు. సెలబ్రిటీగా ఉన్నారు. కాబట్టి మీ జీవితాన్ని మైక్రోస్కోప్‌ నుంచి చూసినంత క్షుణ్ణంగా పరిశీలిస్తారు. పోలీసులకు వాంగ్మూలం ఇచ్చే సమయంలో.. మీరు ఏడ్చార‌ని, భర్తతో వాదులాడార‌నే అంశాలు పరువు నష్టం కిందకు రావు. మీరు కూడా ఒక మనిషి కదా అన్న భావనను మాత్రమే స్ఫురిస్తాయి’ అని జస్టిస్‌ గౌతం పటేల్‌ అన్నారు. మీడియా స్వేచ్ఛ‌ను అడ్డుకునేలా తాము వ్యవహరించలేమని న్యాయ‌మూర్తి స్పష్టం చేశారు.  

సెల‌బ్రిటీలు ఆద‌ర్శంగా ఉండాల‌నేలా ప‌రోక్షంగా న్యాయ‌స్థానం శిల్పాశెట్టికి హిత‌బోధ చేసింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అలాగే ప‌బ్లిక్ లైఫ్‌లో ఉన్న వాళ్లు విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా జీవించాలే త‌ప్ప‌, వ‌స్తే తాము అడ్డుకోలేమ‌ని కోర్టు స్ప‌ష్టం చేయ‌డం విశేషం. ఏది ఏమైతేనేం సాగ‌ర క‌న్య‌ శిల్పాశెట్టికి న్యాయ‌స్థానంలో నిరాశే ఎదురైంది.