ఆంధ్రలో యాభై శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతి.
సెకండ్ షో లకు అనుమతి లేదు
టికెట్ రేట్లు ఏ మేరకు తగ్గించారు అన్నది అందరికీ తెలిసిందే.
గీతా, యువి, ఆసియన్, సురేష్ మూవీస్ లాంటి ఎగ్జిబిషన్ సంస్థలు థియేటర్లు తెరవడానికి పెద్దగా ముందుకు రావడం లేదు.
ఇక కలెక్షన్లు ఎలా వుంటాయి? ఏ మేరకు వుంటాయి? రెవెన్యూలు, షేర్ లు ఏ మేరకు కిట్టుబాటు అవుతాయి. ఎందుకు సినిమాలు విడుదల చేయాలి? ఆంధ్ర ప్రభుత్వం ఈ నెలాఖరుకు సెకెండ్ షో లకు అనుమతి ఇస్తుందేమో అని ఆశించారు. ఆగస్టు 16 వరకు అలాంటిది ఏమీ లేదని తేలిపోయింది. యాభై శాతం ఆక్యుపెన్సీ ఇప్పట్లో మారదు అని ప్రభుత్వం వైపు నుంచి అంతర్గతంగా క్లారిటీ వచ్చేసింది.
ఇక మిగిలింది టికెట్ రేట్లు. అవి కూడా ఇప్పట్లో మారే సూచనలు లేవు అని తేలిపోయిందని టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఈ మేరకు సిఎమ్ జగన్ మనోగతం అధికారుల ద్వారా టాలీవుడ్ కు చేరిపోయిందని బోగట్టా. అక్టోబర్ వేళకు చూద్దాం అని సిఎమ్ జగన్ అన్నారన్నది ఆ సమాచారంలో కీలకపాయింట్.
దీంతో ఆగస్టులో సినిమాలు విడుదల అవుతాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆగస్టు రెండో వారం తరువాత పరిస్థితి మెరుగు అవుతుందని, జనం థియేటర్లకు రావడం మెరుగు అవుతుందని అనుకున్నారు. కానీ వ్యవహారం చూస్తుంటే ఆగస్టు కూడా సినిమాలకు అనుకూలం అనిపించడం లేదు.
ఆరున విడుదలకు ప్లాన్ చేసిన ఎస్ ఆర్ కళ్యాణ మండపం కూడా ఇప్పుడు తేదీ మార్చే ఆలోచనలో వుంది. ఆగస్టు నెలాఖరులో డైరక్టర్ మారుతి-యువి కాంబినేషన్ లో తయారైన మంచిరోజులు వచ్చాయి వేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితిని గమనించి కానీ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు.
చైతన్య -సాయిపల్లవిల లవ్ స్టోరీ సినిమాను ఎప్పుడు వందశాతం ఆక్యుపెన్సీ వస్తే అప్పుడు విడుదల చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఆ కోరిక ఇప్పట్లో నెరవేరేలా లేదు. టక్ జగదీష్ ను ఓటిటికి బేరం ఫిక్స్ చేసుకుని వుంచుకున్నారని బోగట్టా. థియేటర్ వ్యవహారం సెటిల్ కాకపోతే ఓటిటికి ఇచ్చేయాలని డిసైడ్ అయి వున్నారు.
ఇలా టాలీవుడ్ ఇప్పుడు అటు ఇటు కాకుండా స్ధంభించింది. ఇవన్నీ చూస్తుంటే, పరిస్థితులు గమనిస్తుంటే ఆగస్టులో సినిమాల విడుదల సక్రమంగా వుంటుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.