సోషల్ మీడియాను జనాలను ట్రోల్ చేసేందుకే వాడే వారి సంఖ్య భారీగానే ఉంటుంది. భావవ్యక్తీకరణకు ఒక వేదిక ఉంది కదా అని చెప్పి, తమకు నచ్చని అంశాల విషయంలో ట్రోల్ పేరుతో రాక్షసానందాన్ని చాటుకునే జనాలకు సోషల్ మీడియాలో కొదవలేదు.
ప్రత్యేకించి సెలబ్రిటీల్లో తమకు నచ్చని అంశంపై విపరీత స్థాయిలో వ్యాఖ్యానాలు సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తూ ఉంటాయి.
హీరోయిన్లు, సెలబ్రిటీల పిల్లలు.. వీళ్లంతా ఇలాంటి ట్రోల్స్ కు బాధితులే. ప్రత్యేకించి బాడీ షేమింగ్ అయితే పరాకాష్ట స్థాయిలో జరుగుతూ ఉంటుంది. ఇలాంటి క్రమంలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ కాజోల్ ను నెటిజన్లు ఇప్పుడు ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆమె జిమ్ డ్రస్ లో అగుపించే ఒక వీడియోను పట్టుకుని ఆమె పై బాడీ షేమింగ్ కు పాల్పడుతున్నారు నెటిజన్లు.
ఆ డ్రస్ లో కాజోల్ ఏమీ ఎబ్బెట్టుగా లేదు. కొంచెం ఒళ్లు చేసినట్టుగా అగుపిస్తుందంతే. ఈ అంశంలో ఆమెను విపరీత స్థాయిలో ట్రోల్ చేశారు కొంతమంది. ఆమెను ఏనుగు అంటూ, కచ్చితంగా ప్రెగ్నెంట్ .. అంటూ కామెంట్లకు దిగారు.
కాస్త లావుగా కనిపించే సరికి.. ఈ మాజీ హీరోయిన్ పై ఇలా అనుచితమైన రీతిలో ట్రోల్ కు దిగేంత ఖాళీగా ఉన్నారా జనాలు? అనే సందేహం రానే వస్తుంది.
కేవలం కాజోల్ అనే కాదు, చాలా మంది విషయంలో బాడీ షేమింగ్, మోరల్ పోలిసింగ్.. తో రెచ్చిపోతూ ఉంటారు కొంతమంది. సోషల్ మీడియా ఉన్నదే దీనికన్నట్టుగా వీరు తెగ రియాక్ట్ అయిపోతూ ఉంటారు.