ఇది వరకే పలుసార్లు చెప్పారు మెగాస్టార్ చిరంజీవి, డాడీ సినిమా తనకు రాంగ్ చాయిస్ అయ్యిందంటూ మెగాస్టార్ గతంలోనే చెప్పారు. సెంటిమెంటల్ డ్రామా అయిన డాడీ సినిమా టీవీలో బోలెడన్ని సార్లు ప్రసారం అవుతూనే ఉంటుంది.
ఆ సినిమాలో కామెడీ కూడా సీన్లు సీన్లుగా చూసినప్పుడు బాగానే ఉంటుంది. అయితే.. థియేటర్లలో మాత్రం డాడీ సినిమాకు ప్రేక్షకుల యాక్సెప్టెన్స్ లభించలేదు.
మా సినిమా థియేటర్లలో హిట్ కాకపోయినా, టీవీల్లో బాగా ఆడిందంటూ కొన్ని సినిమాల రూపకర్తలు చెప్పుకుంటూ ఉంటారు. అయితే డాడీ విషయంలో మాత్రం చిరంజీవి ఇలా అనరు. ఆ సినిమా తను చేయాల్సింది కాదంటూ చిరంజీవి చెబుతూనే ఉంటారు. ఈ క్రమంలో ఎఫ్ 3 ప్రమోషనల్ ఈవెంట్ లో కూడా వెంకటేష్ ను చూడగానే చిరంజీవికి డాడీ నే గుర్తుకు వచ్చినట్టుంది.
ఆ సినిమా వచ్చినప్పుడే చిరు, వెంకీల మధ్యన ఈ చర్చ జరిగిందట. 'నువ్వు ఏ పాత్రగా అయినా ఏడిస్తే ప్రేక్షకులు చూస్తారు వెంకీ, అదే నేను ఏడిస్తే చూడలేరు..' అంటూ డాడీ విడుదల అయిన తర్వాత వెంకటేష్ తో అన్నారట చిరు. వెంకటేష్ గనుక ఆ సినిమాను చేసి ఉంటే కచ్చితంగా హిట్ అయ్యేదనేది చిరంజీవి నమ్మకం.
ఆ సమయంలో వెంకటేష్ అరవ సెంటిమెంట్ సినిమాల రీమేక్ లతో ఒక ఊపు మీద ఉన్నారు. అదే క్రమంలో డాడీ ని కూడా వెంకటేష్ చేసి ఉంటే సేఫ్ వెంచర్ అయ్యేదేమో! ఎఫ్ త్రీ ప్రమోషన్ లో పాలు పంచుకున్న చిరంజీవి.. డాడీ అనుభవాన్ని మరోసారి ఇలా గుర్తు చేసుకున్నారు.