పటేళ్లకు రిజర్వేషన్ల ఉద్యమం ద్వారా గుజరాత్ నుంచి మార్మోగిన పేరు హార్దిక్ పటేల్. పిన్న వయసులోనే హార్దిక్ పటేల్ జాతీయ స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నాడు.
గుజరాత్ లో ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థాయిలో ఉన్న పటేళ్లు రిజర్వేషన్లు అంటూ ఉద్యమించడమే తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అయితే ఆ ఉద్యమం భారీ ఎత్తున జరగడం కూడా దానిపై చర్చకు ఆస్కారం ఇచ్చింది.
ఖరీదైన కార్లలో, బైక్ ల మీద ఒంటిపై బంగారు నగలతో పటేళ్లు రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్నారు అంటూ అప్పట్లో వారిపై ట్రోలింగ్ కూడా జరిగింది. రిజర్వేషన్ల ఉద్యమం ద్వారా తనకు లభించిన గుర్తింపును రాజకీయంపై పెట్టుబడిగా మార్చుకున్నాడు హార్ధిక్ పటేల్. ఆ ఉద్యమంలో ఉన్నప్పుడే అతడిపై రకరకాల కేసులు నమోదయ్యాయి. అరెస్టులూ విచారణలు కూడా జరిగాయి.
క్రితం సారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయానికి హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగా మారాడు. అయితే హార్దిక్ ద్వారా కాంగ్రెస్ కు అధికారం దక్కలేదు. ఇటీవలే హార్దిక్ పటేల్ కాంగ్రెస్ కు రాజీనామా కూడా చేశాడు. ఆప్ లోకి చేరతాడనే ఊహాగానాలు వచ్చినా, వాటినీ స్వయంగా ఖండించాడు. ఆప్ మరో కాంగ్రెస్ అన్నాడు.
ఇక హార్దిక్ బీజేపీలోకి చేరడమే తరువాయి అని తెలస్తోంది. మరో రెండ్రోజుల్లో ఇతడు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లూ బీజేపీ నేతలను విపరీత స్థాయిలో తిట్టాడు హార్దిక్ పటేల్. తమ రిజర్వేషన్ల ఉద్యమం దశ నుంచినే వారిపై విరుచుకుపడుతూ వచ్చాడు.
ఇప్పుడు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నం అవుతున్న దశలో బీజేపీ కూడా అతడిని దువ్వినట్టుగా ఉంది. ఈ క్రమంలో పటేళ్ల రిజర్వేషన్ల ఉద్యమం నేత బీజేపీ తిడుతూ గుర్తింపును దక్కించుకుని, ఇక నుంచి బీజేపీని భుజానికి ఎత్తుకోనున్నాడు.