ఏపీ అంటే ప్రధాని నరేంద్ర మోడీకి ప్రేమ అని కేంద్ర మంత్రి శర్వానంద్ సోనేవాల్ అంటున్నారు. ఏపీకి ఎన్నో చేయాలని మోడీ అనుకుంటున్నారని, ఏపీ అభివృద్ధికి మోడీ కంకణం కట్టుకున్నారని కూడా ఆయన చెబుతున్నారు.
తాజాగా జరిపిన విశాఖ టూర్ లో మోడీ ఎనిమిదేళ్ళ పాలనను పొగిడిన సందర్భంగా కేంద్ర మంత్రి ఏపీ సర్కార్ కలసిరావాలని మోడీ అందించే ప్రగతి ఫలాలను అందుకోవాలని కోరడం విశేషం.
ఏపీకి ఎన్నో సహజవనరులు ఉన్నాయని, సుందర రాష్ట్రమని కితాబు ఇచ్చిన కేంద్ర మంత్రి ఏపీ అభివృద్ధి అంతా కేంద్రానిదే అని కూడా అనేసారు. 22 లక్షల ఇళ్ళు ఏపీకి కేటాయించిన ఘనత కేంద్రానిది మోడీది అని కూడా పేర్కొన్నారు.
ఏపీ సర్కార్ నోరు తెరచి అడిగాలే కానీ ఇంకా కేంద్రం ఎన్నో వరాలు ఇస్తుందని ఆయన మాట్లాడారు. అంతా బాగానే ఉంది కానీ నోరు తెరచి ప్రత్యేక హోదా ఇవ్వమని ఏపీ అడుగుతోంది, అలాగే పోలవరం పూర్తిచేయమంటోంది, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా చూడమని కూడా ప్రాధేయపడుతోంది. విభజన హామీలను అమలు చేయమని కూడా కోరుతోంది.
కానీ కేంద్ర పెద్దలు ఏమో మేమేమి ఇస్తే అదే తీసుకోండి. మా కళ్ళతో అభివృద్ధి చూడండి అని అంటున్నారు. అందుకే ఏపీ మీద కేంద్రం ప్రేమ అన్నది ఏపీ జనాలు చూడలేకపోతున్నారు. అయినా కేంద్ర మంత్రులు పెద్దలు మాత్రం ఏపీ మీద మాకు చచ్చేంత ప్రేమ అంటున్నారు. మరీ అంత ప్రేమను ఏపీ భరించలేదు మహానుభావా మేము కోరినవి ఇవ్వండి స్వామీ అంటే వింటారా.