దివ్యవాణి : లలలాం లలలాం లక్కీచాన్సులే!

తెలుగుదేశం పార్టీలో చిన్న కుదుపు. టీకప్పులో తుపాను లాంటి ఓ బుల్లి వ్యవహారం రేగడమూ. అంతలోనే సద్దుమణిగిపోవడమూ అంతా గంటల వ్యవధిలోనే జరిగిపోయింది.  Advertisement తెలుగుదేశం పార్టీకి చెందిన దివ్యవాణికి ఒక లక్కీ చాన్స్…

తెలుగుదేశం పార్టీలో చిన్న కుదుపు. టీకప్పులో తుపాను లాంటి ఓ బుల్లి వ్యవహారం రేగడమూ. అంతలోనే సద్దుమణిగిపోవడమూ అంతా గంటల వ్యవధిలోనే జరిగిపోయింది. 

తెలుగుదేశం పార్టీకి చెందిన దివ్యవాణికి ఒక లక్కీ చాన్స్ కొట్టేసింది. మామూలుగా అయితే.. ఆమెను యథోరీతిగా పార్టీలో ఎవ్వరూ పట్టించుకునే పరిస్తితి లేదుగానీ.. తాజాగా రేగిన తుపానుతో ఆమె వ్యథను చంద్రబాబు, లోకేష్ వినే అవకాశం ఉంది. 

ఇంతకూ ఏం జరిగిందంటే.. 

దివ్యవాణి మహానాడు తర్వాత ఒక యూట్యూబ్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో.. తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఎంతోకాలంగా సేవలందించిన తనకు, మహానాడులో మాట్లాడే అవకాశం కూడా కల్పించలేదంటూ ఆవేశం వ్యక్తం చేసింది. కొందరు వ్యక్తులు పార్టీలో తనను ఎదగనివ్వకుండా కుట్రలు పన్నుతున్నారంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. 

సాధారణంగానే.. ఏ వివాదాస్పద అంశం వస్తుందా దాన్ని మరింత రచ్చరచ్చగా మార్చేద్దామా అని కొందరు ఆన్ లైన్ వీరులు ఎదురుచూస్తూ ఉంటారు. దివ్యవాణి ఇలా అసంతృప్తి వెళ్లగక్కిన విషయాన్ని పట్టుకున్నారు. పార్టీ క్రమశిక్షణ సంఘం పేరుతో ఆమెను పార్టీనుంచి సస్పెండ్ చేసినట్టు ఒక నకిలీ లేఖను పుట్టించారు. ప్రచారంలో పెట్టారు. 

దీంతో దివ్యవాణికి ఆవేశం వచ్చేసింది. పార్టీలో కొందరు కుట్రదారులు ఉన్నారని అంటూ.. తనకు ఎదుగుదల లేని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసేస్తున్నట్లు ట్విటర్ ద్వారా ప్రకటించింది. ఈలోగానే సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు పుట్టేశాయి. ఆమె వైసీపీలో చేరబోతున్నట్లుగా ఒక ప్రచారం వచ్చింది. ఆమెకు కెఎ పాల్ ఫోన్ చేసినట్టుగా మరో ప్రచారం వచ్చింది. 

ఏదైతేనేం.. పార్టీకి ప్రజల్లో చాలా చాలా క్రేజ్ పెరుగుతున్నట్లుగా బిల్డప్ లు ఇచ్చుకుంటున్న తరుణంలో ఈ కొత్త గోల ఏంట్రా బాబూ.. అంటూ పార్టీ కంగారుపడింది. చకచకా విషయం ఆరాతీశారు. క్రమశిక్షణ కమిటీ సారధి బచ్చెల అర్జునుడు ఆమెకు ఫోన్ చేశారు. సస్పెన్షన్ లేఖ నకిలీ అనే క్లారిటీ ఇచ్చారు. తొందరపడి ముందే ట్వీటిన దివ్యవాణి ఆ ట్వీటును డిలిట్ చేసింది. మొత్తానికి పార్టీలోనే కొనసాగుతున్నది.

అయితే ఈ టోటల్ ఎపిసోడ్ లో లక్కీచాన్స్ ఏంటా అనుకుంటున్నారా? దివ్యవాణి పార్టీకి అధికార ప్రతినిధి అయినప్పటికీ.. ఆమె మీడియాముందు గొంతు చించుకోవాల్సిందే తప్ప.. ఆమె మొరను పార్టీలో వినే పెద్దలు లేరు. చంద్రబాబు గానీ, లోకేష్ గానీ.. ఆమెకు అపాయింట్మెంట్లే ఇవ్వడం లేదని సమాచారం. 

అయితే.. ఇప్పుడు రాజీనామా డ్రామా నడవడంతో.. ఆమెకు వారితో మాట్లాడే చాన్స్ దక్కిందని.. పార్టీలో తన భవిష్యత్తు గురించి వారినుంచి హామీ తీసుకోవాలని అనుకుంటోందని తెలుస్తోంది.