టీడీపీ కప్పులో దివ్యవాణి తుపాను..!

మహానాడు తర్వాత చంకలు గుద్దుకుంటున్న టీడీపీ బ్యాచ్ కి ఈరోజు దివ్యవాణి చుక్కలు చూపించింది. మహానాడు అయిపోగానే దివ్యవాణి 'యుద్ధనాడు' మొదలైంది. ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. టీడీపీలో తనకు గౌరవం…

మహానాడు తర్వాత చంకలు గుద్దుకుంటున్న టీడీపీ బ్యాచ్ కి ఈరోజు దివ్యవాణి చుక్కలు చూపించింది. మహానాడు అయిపోగానే దివ్యవాణి 'యుద్ధనాడు' మొదలైంది. ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. టీడీపీలో తనకు గౌరవం దక్కలేదని వాపోయింది. తనను సరిగా వినియోగించుకోవడం లేదని, అధికారం లేని అధికార ప్రతినిధి అనే పదవి ఇచ్చి కూర్చోబెట్టారని కూడా చెప్పింది.

అక్కడితో ఆగలేదు.. మహానాడులో తనకు మహా అవమానం జరిగిందని చెప్పుకొచ్చింది. మహానాడులో తన ప్రసంగం కోసం ఎవరెవరి చుట్టూనో తిరగాల్సి వచ్చిందని, దివ్యవాణికి మాట్లాడ్డం చేతకాదా అని ప్రశ్నించింది కూడా. 

ఒకవేళ మహానాడుకి తాను హాజరయ్యే క్రమంలో యాక్సిడెంట్ లో పోతే.. తన శవాన్ని అడ్డు పెట్టుకుని కూడా ఓట్లు అడిగేవారేమో అనే సంచలన కామెంట్ కూడా పార్టీపై చేశారు దివ్యవాణి. ఈ ఇంటర్వ్యూ బయటకు రాగానే సహజంగా చిలవలు పలవలు చేస్తూ థంబ్ నెయిల్స్ పెట్టారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ ఇంటర్వ్యూని బేస్ చేసుకుని వార్తలల్లింది.

అక్కడి వరకు బాగానే ఉంది. దివ్యవాణిలో ఫ్రస్టేషన్ ఆ ఇంటర్వ్యూ ద్వారా బయటపడింది. అయితే అంతలోనే బచ్చల అర్జునుడి పేరుతో దివ్యవాణిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది నిజమనుకునే లోపే దివ్యవాణి ట్విట్టర్ హ్యాండిల్ నుంచి టీడీపీకి రాజీనామా అనే మెసేజ్ వచ్చింది. దీంతో మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాకి చేతినిండా పని దొరికింది.

టీడీపీకి దివ్యవాణి రాజీనామా అనే హెడ్డింగ్ పెట్టి.. చెప్పిందే చెప్పి టీడీపీని ఉతికి ఆరేశారు. మహానాడు సంతోషం కూడా లేకుండా చేశారు. దీంతో దివ్యవాణి అలర్ట్ అయ్యారు. తన రాజీనామాపై సింపతీ రాకపోగా అసలుకే మోసం వచ్చే పరిస్థితి రావడంతో ఆమె వెనక్కి తగ్గింది. అటు టీడీపీ అధినాయకత్వం కూడా దివ్యవాణిని బుజ్జగించడంతో ఆమె వెనక్కి తగ్గినట్టున్నారు. ట్వీట్ డిలీట్ చేశారు. తాను రాజీనామాయే చేయలేదన్నట్టు కలరింగ్ ఇచ్చారు.

తొడగొట్టలేక రాజీనామా..! డ్రామా..!!

మహానాడులో తొడ కొట్టిన మహిళకు ఎక్కువ మైలేజీ రావడంతో.. ప్రచారం కోసం దివ్యవాణి ఈ రూటు ఎంచుకున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ పార్టీలో తనకంటూ ఉన్న క్రేజ్ ను ఎవరో వచ్చి, ఇలా తొడకొట్టి అలా ఎగరేసుకుపోవడాన్ని ఆమె తట్టుకోలేకపోయారట. మరీ ముఖ్యంగా తనకున్న ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ పోతోందని ఆమె తెగ ఇదైపోయినట్టు కనిపిస్తోంది. 

అందుకే ఆమె ఇలా రాజీనామా అస్త్రంతో సంచలనం సృష్టించే ప్రయత్నం చేశారనే వాదన కూడా ఉంది. ఏదేమైనా దివ్యవాణి రాజీనామా టీడీపీ కప్పులో తుపానులా చల్లారిపోయింది. పార్టీని బెదిరించడంలో, తన మాట నెగ్గించుకోవడంలో దివ్యవాణి సక్సెస్ అయిందనే చెప్పాలి. 

పాపం ఆమె నిజంగానే రాజీనామా చేసిందని వార్తలు వండి వార్చిన మీడియా సంస్థలన్నీ సాయంత్రానికి నాలుక కరుచుకున్నాయి. దివ్యవాణి రాజీనామా ట్వీట్ డిలీట్ చేశారని చెప్పుకొచ్చాయి. 

మొత్తమ్మీద మహానాడులో తొడగొట్టిన గ్రీష్మకి ఎంత ఎలివేషన్ వచ్చిందో ఈరోజు రాజీనామా ఎపిసోడ్ తో దివ్యవాణికి అంత మైలేజీ పెరిగింది. మధ్యలో తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాత్రం.. అటు తొడకొట్టుడుకు, ఇటు రాజీనామా డ్రామాకు మధ్య నలిగిపోయారు.