ముప్పుతిప్పలు పెట్టిన “వైఫ్ మిస్సింగ్” కేసును తిరుపతి పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ కేసులో భర్తనే హంతకుడిగా గుర్తించారు. అంతేకాదు.. 5 నెలలుగా మిస్సయిన భార్య మృతదేహాన్ని కూడా వెలికితీశారు. సంచలనం సృష్టించిన ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్దాం..
హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న తిరుపతికి చెందిన వేణుగోపాల్, అదే ప్రాంతానికి చెందిన పద్మను పెళ్లి చేసుకున్నాడు. పిల్లను ఇస్తూ, కట్నం కింద 20 లక్షల రూపాయలు, భారీగా బంగారాన్ని కూడా ఇచ్చారు పద్మ తల్లిదండ్రులు. అయితే పెళ్లి అయిన కొన్ని రోజులకే వేణుగోపాల్-పద్మ మధ్య అభిప్రాయబేధాలొచ్చాయి.
పద్మను హింసించడం మొదలుపెట్టాడు వేణుగోపాల్. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో పద్మ, పుట్టింటికి వచ్చేసింది. గొడవలు ముదరడంతో ఇరువురు పరస్పరం ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు.
ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో పద్మను తిరిగి కాపురానికి తీసుకెళ్లాడు వేణుగోపాల్. ఆమెతో సఖ్యతగానే ఉంటానంటూ పద్మ తల్లిదండ్రులకు హామీ కూడా ఇచ్చాడు. తమ కూతుర్ని, అల్లుడి దగ్గరకు కాకుండా అనంతలోకాలకు పంపిస్తున్నామనే విషయాన్ని ఆ తల్లిదండ్రులు గ్రహించలేకపోయారు.
అలా పద్మను తిరుపతిలోని తన ఇంటికి తీసుకొచ్చిన వేణుగోపాల్.. జనవరి 5న ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని సూట్ కేసులో కుక్కి, తిరుపతి శివార్లలోని వెంకటాపురం చెరువులో పడేశాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి మిస్సింగ్ కేసు పెట్టాడు. మరోవైపు పద్మ సెల్ ఫోన్ ను తను వాడడం మొదలుపెట్టాడు. పద్మ ఛాట్ చేస్తున్నట్టు, ఆమె తల్లిదండ్రులతో ఛాట్ చేయడం మొదలుపెట్టాడు.
అలా 5 నెలల పాటు వాట్సాప్ డీపీలు కూడా మారుస్తూ ఏమార్చే ప్రయత్నం చేశాడు. అయితే తమ కూతురు వాట్సాప్ లో స్పందిస్తోంది తప్ప, కాల్ లిఫ్ట్ చేయడం లేదనే అనుమానం తల్లిదండ్రులకు వచ్చింది. చాలా రోజులు చూసిచూసి వాళ్లు పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. వేణుగోపాల్ ను తమదైన శైలిలో ప్రశ్నించిన పోలీసులకు, అసలు నిజం తెలిసొచ్చింది. 5 నెలల తర్వాత చెరువులోంచి పద్మ మృతదేహాన్ని వెలికితీశారు పోలీసులు.
తనతో కాపురం చేయడానికి పద్మ నిరాకరించిందని, విడాకులు కూడా ఇవ్వడానికి అంగీకరించలేదని ఆరోపిస్తున్నాడు వేణుగోపాల్. చట్టాలన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని, తనను ఏమీ చేయలేవంటూ పద్మ తనను వేధించడం మొదలుపెట్టిందని, ఈ క్రమంలో తనపై కేసులు కూడా పెట్టిందని.. తప్పనిసరి పరిస్థితుల్లో మరో ఆప్షన్ లేక ఆమెను హత్య చేయాల్సి వచ్చిందని లొంగిపోయిన వేణుగోపాల్ ప్రకటించాడు.