శ్రావణ మాసం మరి కొద్ది రోజుల్లో వస్తోంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇలాంటి శ్రావణ మాసాలు రెండు వచ్చాయి. మొదటిసారి కొత్త పాలన ఆ బిజీతో గడచింది. రెండవసారి గత ఏడాది కరోనా బాధలతో మంచి కాలం పోయింది.
అయితే ఈసారి శ్రావణ మాసాన్ని వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో పోనీయదు అన్న మాట అయితే వినిపిస్తోంది. జగన్ విశాఖను పాలనా రాజధాని అన్నారు.
గత ఏడాది ఇదే టైమ్ లో ఆగస్ట్ నెలలో ముహూర్తం కూడా పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం విశాఖలో శంకుస్థాపన చేస్తారు అంటున్నారు.
ముఖ్యంగా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకి ఆయన శ్రీకారం చుడతారు అని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే భూసేకరణ పూర్తి అయింది. నిర్వాసితులకు కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. వారు ఇళ్ళు నిర్మించుకోవడానికి కూడా ఏర్పాట్లు చేశారు.
దాంతో ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఎయిర్ పోర్ట్ శంకుస్థాపన జరగడం ఖాయమని అంటున్నారు. ఆగస్ట్ నెలాఖరులో ముఖ్యమంత్రి విశాఖ టూర్ ఉంటుందని చెబుతున్నారు.
ఆ రోజున భోగాపురం ఎయిర్ పోర్టు తో పాటు పెద్ద ఎత్తున ఇతర కార్యక్రమాలను కూడా సీఎం ప్రారంభిస్తారు అంటున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ఇందులో ఉంటే ఉండొచ్చు అన్న మాట అయితే ఉంది.