మూవీ రివ్యూ: ఇష్క్

చిత్రం: ఇష్క్ తారాగణం: సజ్జా తేజ, ప్రియా ప్రకాష్ వారియర్, రవీంద్ర విజయ్ తదితరులు రేటింగ్: 2/5 కథ: రతీష్ రవి ఎడిటింగ్: వరప్రసాద్ కెమెరా: శ్యామ్ కె. నాయుడు సంగీతం: మహతి స్వర…

చిత్రం: ఇష్క్
తారాగణం: సజ్జా తేజ, ప్రియా ప్రకాష్ వారియర్, రవీంద్ర విజయ్ తదితరులు
రేటింగ్: 2/5
కథ: రతీష్ రవి
ఎడిటింగ్: వరప్రసాద్
కెమెరా: శ్యామ్ కె. నాయుడు
సంగీతం: మహతి స్వర సాగర్
నిర్మాత: ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్, వాకాడ అంజన్ కుమార్
దర్శకత్వం: ఎస్.ఎస్. రాజు
విడుదల: 30 జూలై 2021

మలయాళంలో 2019 వచ్చి వెరైటీ చిత్రంగా పేరు తెచ్చుకున్న సినిమా ఇష్క్. అదే టైటిల్ తో తెలుగులో అచ్చుగుద్దినట్టు రీమేక్ చేసారు. ఓటీటీల్లో సినిమాలు చూసి చూసి థియేటర్స్ తెరిచిన ఆనందంలో ఈ సినిమాకొస్తే ఎలాంటి అనుభూతినిచ్చిందో చూద్దాం. 

ముందు కథ చెప్పుకోవాలంటే…

సిద్ధు (సజ్జ తేజ), అను (ప్రియ ప్రకాష్ వారియర్) పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన యువజంట. ఒక రాత్రి వేళ కార్ ని పార్క్ చేసి లోపల ఏకాంతంగా గడుపుతుంటారు. ఆ టైములో అక్కడికి ఇద్దరు పోలీసులొచ్చి గొడవ చేస్తారు. కేస్ బుక్ చేస్తామని బెదిరిస్తారు. నిర్మానుష్యమైన ప్రాంతంలోకి తీసుకెళ్లి భయపెడతారు. అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తాడు అందులో ఒకడు. ఎంత రగిలిపోతున్నా పోలీసుమీద తిరగబడే ధైర్యం చేయలేకపోతాడు సిద్ధు. ఏమీ చెయ్యలేక ఆ పోలీసు చెప్పిందల్లా చేసి అతను వదిలినప్పుడే అక్కడినుంచి వెళ్లగలుగుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? హీరో తన హీరోయిజాన్ని ఎలా చూపించాడు? చివరికి హీరోయిన్ దృష్టిలో అతని హీరోయిజం ఏమయ్యింది? ఇదీ మొత్తంగా ఇష్క్ కథ. 

తీరుబడిగా ఇంట్లో కూర్చుని నచ్చని చోట స్కిప్ చేస్తూ ఓటీటీలో చూడదగిన సినిమాని హాల్లో పెద్ద స్క్రీన్ మీద కదలకుండా చూడాలంటే ఆ అనుభవం వర్ణనాతీతం. సాధారణంగా సినిమా అంటే 60-70 సీన్స్ మినిమం ఉంటాయి. కానీ మొత్తంగా 4-5 సీన్స్ తో కంప్లీటయిన సినిమా ఇది. ఫస్టాఫులో ఒక పెద్ద సీన్, సెకండాఫులో ఇంకొక పెద్ద సీన్ ఈ సినిమాని నడిపిస్తాయి. ఇలాంటప్పుడు స్క్రీన్ ప్లే, పర్ఫార్మెన్స్ ఎంత పకడ్బందీగా ఉండాలో చెప్పక్కర్లేదు. 

మలయాళంలో హీరో డెంటల్ బ్రేసెస్ పెట్టుకుని నాన్ కమెర్షియల్ హీరోలా ఉంటాడు. కానీ ఇక్కడ సజ్జా తేజ రొటీన్ కమెర్షియల్ హీరోలా కనిపిస్తాడు. అలాంటి ఎక్స్పెక్టేషన్ ఇచ్చినప్పుడు సగటు ప్రేక్షకుడికి హీరో ఎప్పుడు విలన్స్ మీద తిరగబడి ఫైటింగ్ చేస్తాడా అనే వెయిటింగ్ మొదలవుతుంది. కానీ ఎప్పటికీ తిరగబడకుండా పిసుక్కుంటూ కూర్చున్నప్పుడల్లా ఫ్రస్ట్రేషన్ తారాస్థాయికి చేరుతుంటుంది. 

“నిజం” సినిమాలో మహేష్ బాబు టైపులో గెటప్పేసి పోలీసు మీద తిరగబడడానికి అతనికున్న భయమేంటో కూడా ఎస్టాబ్లిష్ చేసుంటే కాస్త కన్విన్సింగ్ గా ఉండేది. అతని క్యారెక్టరైజేషన్లో కూడా అమాయకత్వం కనపడాలి. 

అదలా ఉంచితే, ఎదుటి వ్యక్తి హద్దు దాటి ప్రవర్తిస్తున్నప్పుడు సాధుజంతువైనా కూడా తిరగబడుతుంది. ఆ నైజం మనిషిలో సహజసిద్ధంగా ఉంటుంది. అదేమీ చూపించకుండా హీరో చచ్చుసరుకులా పడుండంలోనే ఆడియన్స్ కి చిర్రెత్తుకొస్తుంది. థియేటర్ లో నిట్టూర్పులు మొదలవుతాయి. 

అలాగే సెకండాఫులో కూడా హీరో ప్రతీకారం తీర్చుకునే పద్ధతిలో కూడా లోపాలు కనిపిస్తాయి. విలన్ తప్పు చేస్తే అతన్ని శిక్షించాలి కానీ ఆ తప్పుతో సంబంధం లేనివాళ్లకెందుకు ఇబ్బంది కలిగిస్తున్నాడు హీరో..అనే డౌటుతో కూడా హీరోతో ఆడియన్స్ పూర్తిగా కనెక్ట్ కాలేరు. 

క్లైమాక్స్ లో మాత్రం ఊహించనిదే జరిగింది. తనని అవమానించిన వ్యక్తి మీదకన్నా, ఆ అవమానం జరుగుతున్నప్పుడు చూస్తూ కూర్చున్న హీరో పట్ల హీరోయిన్ అభిప్రాయం ఎలా మారిందో పర్ఫెక్ట్ గా చూపించారు. కథలో సహజత్వం ఈ ఒక్క చోటే బాగా కనపడింది. 

టెక్నికల్గా మహతి స్వర సాగర సంగీతం మెలోడియస్ గా బాగానే ఉంది. సిద్ శ్రీరాం పాడిన పాట అల్రెడీ కాస్త చెవుల్లో మోగింది కాబట్టి అదొక్కటీ హుక్ చేస్తుంది. హీరో వేదన పడుతున్నప్పుడు అతని మనఃస్థితిని చెప్పే లిరిక్స్ కూడా బాగున్నాయి. 

తేజా సజ్జ నటన ఓకే. కానీ ప్రధాన ఆకర్షణ మాత్రం ప్రియ ప్రకాష్ ముఖ వర్ఛస్సే. ఫ్యామిలీ మ్యాన్-2 తో బాగా పాపులర్ అయిన రవీంద్ర విజయ్ నటన సరిగ్గా సరిపోయింది. మిగతా వాళ్లు ఓకే. 

బేసిగ్గా కథలోనే లోపం ఉన్నా కొత్తదనం వలనో, ఆర్టిస్టుల కారణంగానో మలయాళంలో చప్పట్లు పడుండొచ్చు. కానీ తెలుగులో మాత్రం తేలిపోయిన ఫీలింగొచ్చింది. ప్రేమ పచ్చదనం లాంటి మంచి సినిమా చూద్దామనుకుంటే ఎండమావుల ఎడారి కనపడింది. 

బాటం లైన్: ఇసుక