పోసాని ఆరోగ్యం విషమించిందట. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం చాలా క్రిటికల్ గా ఉందట. వైద్యులు తమ శక్తివంచన లేకుండా ఆయనకు చికిత్స అందిస్తున్నారట. 24 గంటలుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వార్తలు ఇవి. ఈ పుకార్లను పోసాని ఖండించారు. తనే స్వయంగా ఓ వీడియో రిలీజ్ చేశారు.
“కొన్నాళ్లుగా నా ఆరోగ్యం బాగాలేదని, విషమంగా ఉందని సోషల్ మీడియాలో వచ్చినట్టు నా ఫ్రెండ్స్ చెప్పారు. నిజమే నాకు ఆరోగ్యం బాగాలేదు. కానీ చచ్చిపోయేంత కాదు. డాక్టర్లు నన్ను పరిపూర్ణ ఆరోగ్యవంతుడ్ని చేశారు. కాబట్టి నా ఆరోగ్యం గురించి మీకెలాంటి ఆలోచనలు వద్దు. వారం, 10 రోజుల్లో మళ్లీ షూటింగ్ కు వెళ్తాను. తెరపై కనిపిస్తాను. ఇన్నాళ్లూ నా ఆరోగ్యం గురించి తపించిన వాళ్లకు కృతజ్ఞతలు.”
పోసానికి ఆరోగ్యం సరిగ్గా లేనిమాట వాస్తవమే. ఆయనకు సర్జరీ జరిగిన మాట కూడా వాస్తవమే. కానీ ఆ ఆపరేషన్ సక్సెస్ అయింది. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఆ విషయాన్ని గతంలో మీడియాకు కూడా ఆయన తెలిపారు. తాజాగా ఆయన రొటీన్ చెకప్ కోసం మరోసారి యశోద హాస్పిటల్ కు వెళ్లారు.
దీన్ని బేస్ చేసుకొని కొంతమంది పుకార్లు సృష్టించారు. దీనిపై పోసాని ఈరోజు స్పందించారు. తను పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, మరో 10 రోజుల్లో షూటింగ్ కూడా వెళ్తానని స్పష్టంచేశారు. ప్రస్తుతం పోసాని చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి.