ప్చ్…ఆ నాయకుడు లేకుండా అమరావతి నుంచి అరసవల్లి వరకూ పాదయాత్ర ప్రారంభం కావడం ఎంతో లోటు కనిపిస్తోంది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాసరావు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, వేలాదిగా తరలి వచ్చిన మహిళలు, రైతులు, నాయకులు… ఇలా ఎందరున్నా, ఆయన లేకపోవడం ఆ ఉద్యమానికి కొరత అని చెప్పొచ్చు. మనిషి ఎక్కడున్నా, మనసంతా అమరావతి పాదయాత్ర-2పైనే. ఇంతకూ రాజధాని ఉద్యమాన్ని అంతగా ప్రేమిస్తున్న ఆ నాయకుడే రఘురామకృష్ణంరాజు.
అధికార పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడైనప్పటికీ, నిత్యం సొంత ప్రభుత్వంపై ఆడిపోసుకుంటుంటారు. అందుకే ఆయన ప్రత్యర్థి పార్టీలకు ఎంతో ఇష్టుడైన నాయకుడు అయ్యారు. హైదరాబాద్, ఢిల్లీ… రఘురామ ఎక్కడున్నా, మనసంతా పాదయాత్రపైనే వుంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజధాని అమరావతిని, ఉద్యమకారులను, ప్రతిపక్ష నాయకులను, ఇంకా చెప్పాలంటే జగన్ వ్యతిరేకులందరినీ ప్రేమించే రఘురామకృష్ణంరాజు మొదటి రోజు పాదయాత్రలో పాల్గొనకపోవడం ఏంటో మరి!
రఘురామ పాదస్పర్శ తగిలి వుంటే ఉద్యమం విజయానికి సంకేతంగా ఉండేది. పాదయాత్ర ప్రారంభం రోజు గోవింద నామస్మరణలు, వేద మంత్రోచ్ఛరణలు, అమరావతి జయజయ ధ్వానాలు ఎన్ని ఉన్నా, రఘురామకృష్ణం రాజు పాదం మోపి వుంటే ఆ ప్రాంతం పునీతమయ్యేది. రఘురామ వచ్చి స్ఫూర్తిదాయక ప్రసంగం చేసి వుంటే, ఉద్యమకారులకు కొత్త శక్తి ఇచ్చినట్టయ్యేది.
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అమరావతి కోసం ఆయన ఎందుకని పాదయాత్ర ప్రారంభానికి రాలేదో అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. ఇంకా 59 రోజులు పాదయాత్ర కొనసాగనుంది. ఏదో ఒక రోజు, మారువేషంలోనైనా ఆయన పాదయాత్రకు రాకుండా వుంటారా? అనే చర్చకు తెరలేచింది. ఆయన తప్పక పాదయాత్రలో పాల్గొంటారు. ఇందుకోసం తన సర్వశక్తులను ఆయన ఒడ్డుతారు.
రఘురామ రాక కోసం పాదయాత్ర రథం ఎదురు చూస్తోంది. రావయ్యా రఘురామ….ఒక్కసారి వచ్చి వెళ్లవయ్యా సామి. నీవు లేని పాదయాత్రను ఊహించుకోవడం కష్టంగా ఉంది.