అమరావతి నుంచి అరసవల్లికి పాదయాత్ర మొదలు పెట్టారు. అమరావతే ఏకైక రాజధానిగా వుండాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధాని కోసం వేలాది ఎకరాలు భూములిచ్చామని, ఇప్పుడు రాజధాని మారిస్తే తమ గతేం కావాలని ప్రభుత్వాన్ని నిలదీయ డాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. అయితే పాదయాత్రలో బౌన్సర్లను పెట్టుకోవడమే విచిత్రంగా కనిపిస్తోంది.
సహజంగా సినీ సెలబ్రిటీల పర్యటనలో బౌన్సర్లనే మాట వింటుంటాం. ఇదేం విడ్డూరమే గానీ, అమరావతి మహా ఉద్యమకారులు పాదయాత్రలో తమ వెంట ఇటూఇటూ బౌన్సర్లను పెట్టుకుని ముందుకు నడుస్తున్నారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని వద్దని ఉత్తరాంధ్రకు దండయాత్రగా వస్తున్నారా? అని ఆ ప్రాంత అధికార పార్టీ నేతలు నిలదీస్తున్న సంగతి తెలిసిందే. దండయాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని వారు హెచ్చరిస్తున్నారు.
దీంతో అమరావతి ఆందోళనకారుల్లో భయం కనిపిస్తోంది. పాదయాత్ర చేస్తున్నప్పుడు ఏ మూల నుంచి ఎలాంటి ఆపద వస్తుందో అనే భయాందోళన మధ్య నడక సాగిస్తున్నారనే భావన కలుగుతోంది. బౌన్సర్ల ఖర్చే తడిసి మోపెడవుతుంది. అయినా అంత మంది పాదయాత్రగా వెళుతుండగా, ఎవరికి వారు రక్షణ కల్పించుకోరా? ప్రత్యేకంగా బౌన్సర్ల అవసరం ఏముంటుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
పాదయాత్రకు ఎటూ పోలీసు రక్షణ వుంది. అలాంటప్పుడు సొంత సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. బాగా డబ్బున్నోళ్ల ఉద్యమం… అట్టుంటది మరి అనే సెటైర్స్ వినిపిస్తున్నాయి. కార్పొరేట్ ఉద్యమమా… మజాకా!