జాతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ లు ధరల గురించి మాట్లాడుతూ ఉన్నాయి. అయితే అది సామాన్యులను ఇబ్బంది పెట్టే నిత్యవసరధరల గురించి కాదు! కాంగ్రెస్, బీజేపీలు ఇప్పుడు తమ పార్టీల ముఖ్యనేతలు ధరించే వస్త్రాల ధరల గురించి పోట్లాడుతున్నారు. భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ ధరించే టీషర్ట్ ల గురించి బీజేపీ వ్యంగ్యంగా స్పందించింది ముందుగా!
రాహుల్ ఏకంగా నలభై వేల రూపాయలు విలువ చేసే టీషర్ట్ లు ధరిస్తున్నారంటూ కమలం పార్టీ ఎద్దేవా చేసింది. ఇందుకు ప్రతిగా కాంగ్రెస్ కూడా ప్రతిదాడి చేసింది. నరేంద్రమోడీ ధరించే దుస్తుల ధరెంతో చెప్పాలంటూ, అమిత్ షా ధరించే మఫ్లర్ విలువ నలభై వేల రూపాయలు కాదా? అంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు!
మీదెంత అంటే.. మీది ఇంత అంటూ ఈ నేతలు పరస్పరం విమర్శలను చేసుకుంటున్నారు. మరి వీరు పోట్లాడుకుంటూ ధరల గురించి చెబుతుండటం సామాన్యులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఒకవైపు మోడీనేమో సాధువునంటూ చెప్పుకుంటున్నారు. అయితే ఆయన ధరించే వస్త్రాలు మాత్రం ఒక రేంజ్ లో ఉంటాయి.
ప్రధాని పీఠం ఎక్కిన దగ్గర నుంచి మోడీ ఒకసారి కనిపించిన దుస్తుల్లో మరోసారి కనిపించి ఎరగరు! అందులోనూ అప్పట్లో మోడీ డిజైన్ చేయించుకున్న దుస్తులు ఈజిప్ట్ ఒకప్పటి నియంత ముబారక్ దుస్తులను గుర్తు చేశాయి. ఆది నుంచి మోడీ ఖరీదైన వస్త్రాలను ధరించడం గురించి కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. భక్తులు మాత్రం.. మోడీకి బట్టలంటే విపరీతమైన ప్రీతి అని, అదొక్కటే ఆయనకు చాలా ఇష్టమని, అందుకే ఆయన మంచి మంచి దుస్తులను ధరిస్తారంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. మరి తమ వ్యవహారాన్ని సమర్తించుకుంటూనే.. రాహుల్ గాంధీ టీషర్ట్ ల గురించి భక్తులు స్పందిస్తారు.
దీంతో మోడీ దుస్తుల ధరెంత, అమిత్ షా వాడే మఫ్లర్ ధరెంత.. జై షా హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు అయిన ఖర్చెంత? అంటూ కమలనాథులను కాంగ్రెస్ వాళ్లు ప్రశ్నిస్తున్నారు!