అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలంటూ అరసవల్లి వరకూ చేపట్టిన పాదయాత్రలో ప్రధాన పార్టీల ముఖ్య నేతలెవరూ కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీన్ని బట్టి మిగిలిన ప్రాంతాల్లో తమపై వ్యతిరేకత రాకూడదని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాదయాత్రలో పాల్గొని ఆ ఉద్యమానికి నాయకత్వం వహించారనే సంకేతాలు వెళితే రాజకీయంగా తమకెక్కడ నష్టం కలుగుతుందో అని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ గజగజ వణికిపోతున్నారనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి.
రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ నిర్ణయం తీసుకున్నారు. మంచోచెడో ఆయన ధైర్యంగా ముందుకెళ్లారు. ఏపీ హైకోర్టు కాదు, కుదరదు అని తీర్పు ఇచ్చింది. మీకు ఆ హక్కు ఎక్కడిదని ఏపీ ప్రభుత్వం ప్రశ్నించింది. మరోసారి మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ నుంచే జగన్ పాలన సాగిస్తారని మంత్రులు పదేపదే చెబుతున్నారు.
మరోవైపు జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కూడా అదే దూకుడుతో వ్యవహరించాలి. రెండో దఫా పాదయాత్రలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మొక్కుబడిగా పాల్గొన్నారనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
మహా పాదయాత్ర-2కు సంబంధించి ప్రారంభ రోజు అత్యంత కీలకం. మొదటి రోజు పాదయాత్రలో టీడీపీ తరపున దేవినేని ఉమామహేశ్వరరావు, నక్కా ఆనంద్‌బాబు, నెట్టెం రఘురాం, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ తరపున కామినేని శ్రీనివాసరావు, పాతూరి నాగభూషణం, జనసేన తరపున ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.శ్రీనివాసయాదవ్ ఉన్నారు. మిగిలిన పార్టీల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే వాళ్లకు ఓట్లు, సీట్లు లేవు.
ఏపీలో బీజేపీకి అంత సీన్ లేనప్పటికీ, కేంద్రంలో అధికారం చెలాయిస్తోంది. అందుకే ఆ పార్టీని పరిగణలోకి తీసుకోవాల్సి వుంటుంది. చంద్రబాబు, లోకేశ్, పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్, సోము వీర్రాజు, సుజనా చౌదరి తదితర టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు మొదటిరోజు పాదయాత్రలో పాల్గొనకపోవడానికి భయమే కారణమని తెలుస్తోంది. ఇంకా ఎన్నికలకు దాదాపు రెండేళ్ల సమయం ఉన్నప్పుడే ప్రతిపక్ష నేతలు ఈ స్థాయిలో భయపడుతుంటే, ఇక ఎన్నికల ముంగిట అమరావతికి ఎంత మాత్రం అండగా వుంటారనే అనుమానాలు, ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కృష్ణాయపాలెం నుంచి లోకేశ్ పాల్గొంటారని ముందే ప్రకటించినా, అనారోగ్యంతో రాలేదని చెబుతున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజం వుందో వారికే తెలియాలి.
అమరావతి నుంచి రాజధాని తరలించడానికి జగన్ ధైర్యంగా ముందుకెళుతుంటే, అడ్డుకోడానికి ప్రతిపక్ష నేతలు మాత్రం భయపడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, సోము వీర్రాజులకు రాజకీయ ప్రయోజనాలే తప్ప, రాజధాని ప్రాంత ప్రజల ఆకాంక్ష ముఖ్యం కాదని మొదటి రోజు పాదయాత్రే తేల్చి చెప్పిందని అంటున్నారు. మొత్తానికి జగన్ దమ్ము, ధైర్యంతో పోల్చితే చంద్రబాబు, పవన్, సోము వీర్రాజు ఉత్త పరికివాళ్లని సోషల్ మీడియాలో వ్యంగ్య కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.