తనను క్షమించాలని ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి వేడుకున్నారు. ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్టు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే పోసాని క్షమాపణ చెప్పడానికి దారి తీసిన పరిస్థితుల గురించి తెలుసుకుందాం.
కరోనా సెకెండ్ వేవ్ దాదాపు అంతరిస్తోందని భావిస్తున్న తరుణంలో … ఆ మహమ్మారి బారిన పోసాని కుటుంబమంతా పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు.
తనతోపాటు తన కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకిందని ఆయన పేర్కొన్నారు. అందరూ గచ్చిబౌళిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు వివరించారు.
కరోనా బారిన పడడంతో.. తాను నటిస్తున్న రెండు పెద్ద సినిమాల షూటింగ్‌లు ఆగిపోయినట్టు పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలు, హీరోలు తనను క్షమించాలని ఆయన కోరారు.
తన వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోవడం బాధగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ప్రేక్షకులు, సినీ పరిశ్రమ ఆశీస్సులతో దేవుడి దయవల్ల త్వరగా కోలుకొని మళ్లీ షూటింగ్‌ల్లో పాల్గొంటానని పోసాని కృష్ణమురళి ఒక ప్రకటనలో తెలిపారు.