ఓ తమ్ముడికి దుఃఖం కట్టలు తెంచుకుంది. తన విధుల్లో భాగంగా సహాయక చర్యలు చేపడుతున్నానని అనుకున్నాడే తప్ప… తన అన్న శవాన్ని వెలికి తీస్తున్న చేదు నిజం అతనికి తెలియలేదు. చివరికి మృతుడు తన అన్న తెలుసుకుని దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చాడు. ఈ విషాద ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది.
హన్మకొండ జిల్లా సూర్యానాయక్ తండాకు చెందిన విశ్రాంత ఎస్ఐ పాపయ్యనాయక్ (60) రెండేళ్ల క్రితం రిటైర్ అయ్యారు. కరీంనగర్‌లో స్థిరపడ్డారు. రాజీవ్ రహదారిపై గురువారం ముల్కనూర్ వైపు వెళ్తుండగా ఆయన కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న బావిలో పడింది. కారుతో పాటే ఆయన జలసమాధి అయ్యారు. కారును బావిలో నుంచి బయటికి తీసేందుకు సమీపంలోని మానకొండూర్ అగ్నిమాపక శాఖ సహాయాన్ని పోలీసులు కోరారు.
ఆ అగ్నిమాపకశాఖ అధికారిగా భూదయ్యనాయక్ విధులు నిర్వర్తిస్తున్నారు. పోలీసుల సమాచారంతో ఆయన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 60 అడుగుల లోతులో ఉన్న కారును బయటికి తీసేందుకు క్రేన్ రప్పించారు. పోలీసులతోపాటు గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది దాదాపు 9 గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు కారును రాత్రి 8 గంటల తరువాత వెలికి తీశారు.
మృతదేహాన్ని చూడగానే అగ్నిమాపకశాఖ అధికారి భూదయ్యలో ఆందోళన, దుఃఖం కట్టలు తెంచుకున్నాయి. మృతదేహం తన సొంత అన్న రిటైర్ ఎస్ఐ పాపయ్యనాయక్‌ది గుర్తించి బోరుమని విలపించాడు. అన్నా… ఎంత పని జరిగిందంటూ గుండెలు బాదుకుంటూ ఆయన కుప్పకూలిపోయారు.
బావిలో పడిన కారులో అన్న ఉన్నాడనే విషయం తెలియక…. అధికారిగా తమ్ముడు సహాయక చర్యలు చేపట్టడం విధి ఆడిన వింత నాటకంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.