అందరికంటే ముందుగా మహేష్ సంక్రాంతికొస్తున్నట్టు ప్రకటించాడు. అంటే దానర్థం, మరో సినిమా రాకూడదని కాదు. అందుకేనేమో తను కూడా సంక్రాంతికొస్తున్నట్టు ప్రకటించాడు పవన్ కల్యాణ్. సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు చాలు అనుకున్నారంతా. ఇలా ఏమైనా రూల్ పెట్టారా అని అడుగుతున్నాడు ప్రభాస్. రెండు పెద్ద సినిమాలకు పోటీగా, తన మూవీని కూడా రెడీ చేశాడు.
అవును.. చాన్నాళ్లుగా వాయిదా పడుతున్న రాథేశ్యామ్ సినిమా విడుదల తేదీని ఈరోజు ప్రకటించారు. సంక్రాంతికొస్తున్నట్టు ఎనౌన్స్ చేశారు. పవన్, మహేష్ తమ సినిమాలు సంక్రాంతికొస్తున్నాయని ప్రకటించి ఊరుకుంటే.. ప్రభాస్ మరో అడుగు ముందుకేశాడు. డేట్ కూడా చెప్పాడు.
సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న రాధేశ్యామ్ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు ప్రభాస్. దీంతో సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ పై ముప్పేట దాడికి రంగం సిద్ధమైందని చెప్పొచ్చు. ఒకేసారి 3 పెద్ద సినిమాలంటే.. థియేటర్లు కళకళలాడతాయి నిజమే, కానీ అదే టైమ్ లో హయ్యస్ట్ థియేటర్లు దొరకడం ప్రతి సినిమాకు కష్టంగా మారుతుంది.
అయితే సినీ విశ్లేషకులు మాత్రం దీనిపై మరోలా స్పందిస్తున్నారు. సంక్రాంతికొస్తున్నామంటూ ఆదికి ముందు ప్రకటించడం, ఆ తర్వాత కొన్ని సినిమాలు తప్పుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం అంటున్నారు. కాబట్టి, ఆ ఆచారం ప్రకారం, సంక్రాంతి నాటికి లాస్ట్ మినిట్ లో ఈ 3 సినిమాల నుంచి ఒకటి తప్పుకోవడం ఖాయం అంటున్నారు. ఆ ఒక్కటి ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఇక రాధేశ్యామ్ అప్ డేట్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు ఈ సినిమా రిలీజ్ అవ్వాలి. కానీ కొత్త రిలీజ్ డేట్ ను సరిగ్గా ఇదే రోజున ప్రకటించారు.