వానాకాలం.. జగన్ ప్రభుత్వానికి కష్టకాలం

ఎండాకాలం, వానాకాలం, చలికాలం అనే తేడా లేకుండా జగన్ ప్రభుత్వం ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం ద్వారా ప్రజలకు నేరుగా ఆర్థిక సాయం చేస్తోంది అయితే వానాకాలం వచ్చిందంటే చాలు సర్కారుకు డ్యామేజీ మొదలవుతోంది. …

ఎండాకాలం, వానాకాలం, చలికాలం అనే తేడా లేకుండా జగన్ ప్రభుత్వం ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం ద్వారా ప్రజలకు నేరుగా ఆర్థిక సాయం చేస్తోంది అయితే వానాకాలం వచ్చిందంటే చాలు సర్కారుకు డ్యామేజీ మొదలవుతోంది. 

వాహనం తీసుకుని రోడ్డెక్కిన ప్రతిఒక్కరూ ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారు. అలా ఉంది ప్రస్తుతం ఏపీలో రోడ్ల అధ్వాన్న స్థితి. అసలు జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందీ అంటే దానికి తొలి కారణం ఇదే అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

నాలుగు కిలోమీటర్ల రోడ్లు వేస్తే సరిపోతుందా, నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లడానికి సాయం చేయక్కర్లేదా అంటూ ఇటీవల ఓ మంత్రి సెలవిచ్చారు. ఆర్థిక సాయం బాగుంది కానీ.. రోడ్డెక్కితే నడుములు విరిగేలా ఉన్నాయి. యాక్సిడెంట్లతో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి కూడా. మరి ఆ ఆర్థిక సాయం ఆస్పత్రి ఖర్చులకే సరిపోతే పరిస్థితి ఏంటి? మౌలిక వసతుల కల్పనను రెండేళ్ల పాటు ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎలా..?

రాష్ట్రంలో 46వేల కిలోమీటర్ల ఆర్ అండ్ బి రహదారులున్నాయి. ఏటా సగటున ఇందులో 9వేల కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయాల్సి ఉంటుంది, లేదా కొత్త రోడ్లను వేయాల్సి ఉంటుంది. అయితే ఈ రెండూ జరక్కపోవడంతో ఇప్పుడు రోడ్లు దారుణంగా తయారయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు మరింతగా ధ్వంసం అయ్యాయి. ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.

ఇప్పటికైనా అధికారులు వీటని పట్టించుకోకపోతే ప్రజాగ్రహానికి గురికావాల్సిందే. ప్రస్తుతం 2వేల కోట్ల రూపాయలతో రోడ్ల మరమ్మతులు చేపడుతున్నట్టు తెలిపారు అధికారులు.

ప్రభుత్వం మారి రెండేళ్లవుతున్నా.. ఇప్పటికికింకా పనులు మొదలు కాలేదు. నిధులు విడుదలయ్యాయి, అదిగో మొదలవుతాయి, ఇదిగో చేసేస్తున్నాం.. అనే డైలాగులు రెండేళ్లుగా వినపడుతూనే ఉన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనలప్పుడు పాక్షికంగా మరమ్మతులు చేస్తున్నారు. మట్టివేసి గుంతలు పూడ్చేస్తున్నారు. అయ్యవార్లు వెళ్లిపోయిన తర్వాత అంతా షరా మామూలే. ఇలాంటి రిపేరింగ్ వర్కులు ఆపేసి, శాశ్వతంగా రోడ్లు బాగు చేయించగలిగితేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది.

గతంలో చంద్రబాబు హయాంలో ఇతర పనులేవీ జరక్కపోయినా రోడ్ల నిర్వహణ బాగుండేదనే పేరుంది. ఇప్పుడు అన్నీ ఇస్తున్నా, అదొక్కటే పక్కనపెట్టారు అధికారులు. ఆ ఒక్క మచ్చ కూడా తుడిచేసుకోవడం, అది కూడా అర్జంట్ గా ఆ పనిచేయడం జగన్ ప్రభుత్వ తక్షణ కర్తవ్యం.