అనంతపురం జిల్లాలో పోలింగ్ రోజున జరిగిన గొడవలో ఒక తెలుగుదేశం కార్యకర్త మరణించాడు. గమనించాల్సిన అంశం ఏమిటంటే.. పోలింగ్ రోజున ఆయన మరణించారు. తాడిపత్రి నియోజకవర్గం పరిధిలో ఆ సంఘటన చోటు చేసుకుంది. రెడ్డి సామాజికవర్గానికే చెందిన ఇరువర్గాల మధ్యన గొడవలో హింస చోటు చేసుకుంది. తోపులాటలో ఒక వ్యక్తి మరణించగా, అనంతర దాడిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఒకరు మరణించారు.
ఇరువర్గాలూ అలా నష్టపోయాయి. పోలింగ్ రోజున ఆ సంఘటన చోటు చేసుకుంది. ఇన్నాళ్లకు చంద్రబాబు నాయుడుకు ఆ సంఘటన గుర్తుకు వచ్చింది! పోలింగ్ జరిగింది ఏప్రిల్ పదకొండో తేదీ. మృతుడి కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు పరామర్శించింది, దానిపై రాజకీయం చేసింది జూలై మొదటివారంలో!
తన అవసరానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు ఈ హత్యా రాజకీయాలను వాడుకుంటారనేది అందరికీ తెలిసిన సంగతే. ఈ పరంపరలో అనంతపురం జిల్లాను అధికారం లేనప్పుడల్లా వాడుకుంటూ ఉంటారు. అదేరీతిన ఈసారి కూడా జరుగుతూ ఉండటం గమనార్హం.
తనచేతిలో అధికారం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడ తమవాళ్లు చేసే హత్యలను పట్టించుకోరు. గత ఐదేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను, కార్యకర్తలను తీవ్రంగా హింసపెట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్లు. రాప్తాడులో అయితే ప్రభుత్వ కార్యాలయంలోనే ప్రసాద్‌రెడ్డి దారుణహత్యకు గురయ్యారు.
కర్నూలులో చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య సంగతీ తెలిసిందే. ఆ హత్యల విషయంలో తెలుగుదేశం ప్రముఖులపై ఆరోపణలు వచ్చాయి. కేసులు నమోదయ్యాయి. ప్రసాద్ రెడ్డి హత్యలో పరిటాల ఫ్యామిలీ పేరు, నారాయణ రెడ్డి హత్యలో కేఈ కుటుంబం పేరు ప్రముఖంగా వినిపించింది.
ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన శాంతి యాత్రలో పరిటాల కుటుంబాన్ని, జేసీ దివాకర్ రెడ్డిని ముందు పెట్టుకుని వెళ్లారు! బహుశా రాయలసీమలో పరిటాల, జేసీలకు మించిన శాంతిదూతలు చంద్రబాబుకు ఉండరు. ఫ్యాక్షన్ రాజకీయంలో మునిగి తేలుతున్న వారిని గతంలో తనే తీవ్రమైన ఆరోపణలు చేసిన వారిని చంద్రబాబు నాయుడు తన శాంతియాత్రకు వెంట పెట్టుకుని వెళ్లి తనదైన కామెడీని చేశారు!