తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవేశం తమ పదవులకు ఎసరు తెస్తుందేమోనని వైసీపీ ఎమ్మెల్సీలు టెన్షన్ పడుతున్నారు. రాజ్యసభలో ఏపీ శాసనమండలి రద్దుపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజూ చెప్పిన సమాధానమే అధికార ఎమ్మెల్సీల ఆందోళనకు కారణమైంది.
టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇస్తూ…ఏపీ శాసనమండలి రద్దు కోరుతూ ఏపీ ప్రభుత్వం 169 వ అధికరణ కింద చేసి పంపిన తీర్మానం తమకు అందిందని, ప్రస్తుతం ఆ అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని స్పష్టం చేశారు.
శాసన మండలిలో తమకు బలం ఉండడంతో టీడీపీ మూడు రాజధానుల బిల్లులను అడ్డుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన ముఖ్య మంత్రి వైఎస్ జగన్… అసలు ఆ మండలి లేకుండా చేస్తే పీడ పోతుందని కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో 2020, జనవరి చివరి వారంలో అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేస్తూ శాసనసభ తీర్మానించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన బిల్లుకు వైసీపీ ఎమ్మెల్యేలు 132 మంది, జనసేన ఎమ్మెల్యే ఒకరు అనుకూలంగా ఓటేశారు. ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభకు హాజరు కాలేదు.
మండలి రద్దు తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపి ఏడాదిపైగా అయింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో మండలిలో టీడీపీ బలం తగ్గింది. ఇదే సమయంలో అధికార పార్టీ బలం పెరిగింది. ఏపీ శాసన మండలిలో మొత్తం 58 మంది సభ్యులున్నారు. ప్రస్తుతం వైసీపీ బలం 21, టీడీపీకి 15 మంది సభ్యులున్నారు. స్థానిక సంస్థల ద్వారా మరో 11 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ వ్యవహారం న్యాయ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. స్థానికంలో వైసీపీ సంపూర్ణ విజయాలు సాధిస్తుందనే నమ్మకం ఆ పార్టీ నేతల్లో ఉంది. దీంతో ఆ 11 మంది ఎమ్మెల్సీలు కూడా వైసీపీ తరపునే ఎన్నికయ్యే అవకాశం ఉంది. అప్పుడు వైసీపీ బలం 32కు పెరుగుతుంది. దీంతో బిల్లులకు సంబంధించి అధికార పార్టీ భయపడాల్సిన పనిలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టు కేంద్ర ప్రభుత్వం మండలి రద్దు నిర్ణయాన్ని తీసుకుంటే తమ పరిస్థితి ఏంటనే ఆందోళన వైసీపీ ఎమ్మెల్సీల్లో నెలకుంది. ఇటీవల మండలి రద్దు తీర్మానంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ …. ఆ తీర్మానానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కానీ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి మాత్రం తీసుకొచ్చేది లేదని ఆయన తేల్చి చెప్పారు.
అంటే బలం పెరిగిన నేపథ్యంలో మండలి కొనసాగాలనేది వైసీపీ అభిమతం. నాడు మూడు రాజధానుల బిల్లులకు అడ్డుపడ్డారనే కోపంతో ఆవేశంలో తీసుకున్న నిర్ణయమని ఆ పార్టీకి బాగా తెలుసు. జగన్ నాటి ఆవేశమే… తమ పదవులకు ఎక్కడ ఎసరు తెస్తుందోననే భయం మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలను వెంటాడుతోందని చెప్పక తప్పదు.