బాయ్ కాట్ లు, బ్యాడ్ రివ్యూలు ఏం చేయ‌లేక‌పోయాయ్!

బాలీవుడ్ 'బ్ర‌హ్మాస్త్ర‌' అనేక ఆటంకాల‌ను అధిగ‌మిస్తూ ఉంది. విడుద‌ల‌కు ముందు భారీ అంచ‌నాల‌కు తోడు.. ఈ సినిమాకు బాయ్ కాట్ హెచ్చ‌రిక‌లున్నాయి. త‌మ‌కు న‌చ్చ‌ని వారి సినిమాల‌ను బాయ్ కాట్ అంటూ ట్రెండ్ చేయ‌డం…

బాలీవుడ్ 'బ్ర‌హ్మాస్త్ర‌' అనేక ఆటంకాల‌ను అధిగ‌మిస్తూ ఉంది. విడుద‌ల‌కు ముందు భారీ అంచ‌నాల‌కు తోడు.. ఈ సినిమాకు బాయ్ కాట్ హెచ్చ‌రిక‌లున్నాయి. త‌మ‌కు న‌చ్చ‌ని వారి సినిమాల‌ను బాయ్ కాట్ అంటూ ట్రెండ్ చేయ‌డం బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు రొటీన్ గా మారింది. అప్పుడెప్పుడో ఏదో అన్నాడ‌ని ఆమిర్ ఖాన్ సినిమాను ఇప్పుడు బాయ్ కాట్ చేయాల‌ని, బీఫ్ తిన్నాడ‌ని ర‌ణ్ భీర్ క‌పూర్ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ పిలుపులు ఇవ్వ‌డం రొటీనే! 

మ‌రి త‌మ బాయ్ కాట్ కు ఒక రేంజ్ లో ప్ర‌భావం ఉంద‌ని వీరు అనుకుంటారేమో! మీడియా కూడా ఈ బాయ్ కాట్ పిలుపుల‌ను చిలువ‌ల‌ను పలువ‌ల‌గా చేస్తూ ఉంటుంది. అంతిమంగా ఈ బాయ్ కాట్ పిలుపుల ప్ర‌భావం శూన్యం అని తేలుతోంది. ఆమిర్ ఖాన్ సినిమా డిజాస్ట‌ర్ అయ్యిందంటే అందుకు కార‌ణం బాయ్ కాట్ పిలుపులు కాదు. సినిమాలో మ్యాట‌ర్ లేక‌పోవ‌డ‌మే.

ఇప్పుడు బ్ర‌హ్మాస్త్ర కూడా అనేక బాయ్ కాట్ పిలుపుల‌ను ఎదుర్కొంది. అయితే ఈ సినిమా మాత్రం వ‌సూళ్ల విష‌యంలో దూసుకుపోతోంది. వీకెండ్ కే ఈ సినిమా వంద కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల మార్కును దాటేసింది. బ్ర‌హ్మాస్త్ర‌కు కేవ‌లం బాయ్ కాట్ పిలుపులే కాదు, బ్యాడ్ రివ్యూలు కూడా వ‌చ్చాయి. ఈ సినిమా కు పెద్ద రేటింగులు రాలేదు క్రిటిక్స్ నుంచి. పెద‌వి విరుపులు గ‌ట్టిగా వినిపించాయి. థియేట‌ర్లో చూసి వ‌చ్చిన ప్రేక్ష‌కులు కూడా ఏదో యావ‌రేజ్ అంటూ వ్యాఖ్యానించారు. 

గ్రాఫిక్స్ పై పెట్టిన శ్ర‌ద్ధ క‌థ‌, క‌థనాల‌పై పెట్ట‌లేద‌నే వ్యాఖ్యానం ప్ర‌ముఖంగా వినిపించింది. మ‌రి ప్రేక్ష‌కుల‌కు ఇంత‌కు మించి ఛాయిస్ లేక‌పోవ‌డంతోనో.. ఏమో కానీ.. క‌లెక్ష‌న్ల ప‌రంగా అయితే ఈ సినిమా ఫ‌ర్వాలేద‌నిపించుకుంటోంది. బాయ్ కాట్ పిలుపులు, బ్యాడ్ రివ్యూల అనంత‌రం.. కూడా ఈ సినిమా ప‌రువు నిలబెట్టుకునే దిశ‌గా సాగుతోంద‌నేది ట్రేడ్ రిపోర్ట్.