బడ్జెట్ ప్రసంగంలో జగన్ ఆవేశాన్ని చాలామంది భూతద్దంలో చూపిస్తున్నారు. రాయలసీమ రౌడీయిజం అంటూ విర్శలుగుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. జగన్ అసలు స్వరూపం బైటపడిందని కొందరు, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని ఇలా భయపెడతారా అని మరికొందరు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ జగన్ అసెంబ్లీలో ఆవేశపడ్డారా లేక ఆయన్ని రెచ్చగొట్టారా అనేదే ఇక్కడ ప్రశ్న. అధికారం చేపట్టిన నాటినుంచి ఇప్పటివరకు జగన్ ని చూసిన వారెవరికైనా అసెంబ్లీలో ఆయన మాట తీరుచూసి ఆశ్చర్యం కలగకమానదు. అయితే సభ సజావుగా సాగనీయక పోవడం వల్లే సీఎం జగన్ లో కోపం కట్టలు తెంచుకుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా గొంతులు నొక్కారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాం, అయినా మీ రుబాబు ఏంటి అని ప్రశ్నించారు జగన్.
అయితే మామూలుగా చెబితే పచ్చ బ్యాచ్ కి ఎక్కదు కదా. అందులోనూ చంద్రబాబు తనది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని ఊరికే కోతలు కోస్తుంటారు. నా అనుభవమంత లేదు నీ వయసు అంటూ జగన్ ని మాటి మాటికీ రెచ్చగొడుతున్నారు. ఈనేపథ్యంలోనే జగన్ మాట కాస్త కటువుగా మారింది. బడ్జెట్ ప్రసంగానికి మాటి మాటికీ అడ్డుతగులుతుండే సరికి కూర్చోవయ్యా కూర్చో అని అన్నారే కానీ, బయటకి వెళ్లవయ్యా అని అనలేదు. అడ్డుతగిలే వాళ్లని ఆమాత్రం అదిలించకపోతే కష్టమే. అందులోనూ కాస్త అవకాశమిస్తే టీడీపీ ఎమ్మెల్యేలు ఊరుకుంటారా. అందుకే అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలని జగన్ టీడీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
గత ఐదేళ్లలో అసెంబ్లీలో ఎప్పుడూ అర్థవంతమైన చర్చ జరగలేదు. ప్రతిపక్షాల గొంతునొక్కి, వారిని సస్పెండ్ చేసి, చివరికి విసుగుతో వారికై వారే అసెంబ్లీని బాయ్ కాట్ చేసేలా చేశారు. ఇప్పుడైనా చర్చలు ఫలప్రదంగా ముగియాలని, అసెంబ్లీ సమావేశాలతో ప్రజలకు మేలు కలగాలని ఆశించారు జగన్. కావాలని రెచ్చగొడుతుంటే ఎవరైనా ఎన్నిసార్లు ఓపిక పడతారు. ఓపిక నశించే జగన్ సభలో గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. అలా జగన్ ను రెచ్చిగొట్టింది టీడీపీ ఎమ్మెల్యేలే.
చర్చకు వచ్చే ధైర్యంలేక రచ్చ మొదలుపెట్టారు. పదే పదే ప్రసంగాలకు అడ్డుతగిలి సీఎం జగన్ ని రెచ్చగొట్టారు. తీరా ఆయనకు సహనం నశించాక సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు పెట్టారు. జగన్ ప్రసంగాన్ని కట్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి, షేర్లు కొట్టి, కామెంట్లు పెట్టినవారంతా ఓ సామాజిక వర్గానికి చెందిన వారనేది స్పష్టమైంది. పార్టీ పగతోపాటు, ఆ సామాజిక వర్గ వైరం కూడా దీనికి ఆజ్యంపోసింది. అందుకే జగన్ ని టార్గెట్ చేశారు. సభలో జగన్ రెచ్చిపోలేదు, కేవలం ఆయనను రెచ్చగొట్టారంతే..?