కృష్ణాజిల్లా తెలుగు ఇంత అసహ్యంగా ఉంటుందా?

కృష్ణా జిల్లా తెలుగంటే ప్రామాణికమైన తెలుగని, పత్రికాభాష అదేనని చెప్పుకుంటారు అక్కడి వాళ్లు. అందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏదో రకంగా తెలుగుబాషమీద అభిమానాన్ని చూపిస్తున్నందుకు ఆ ప్రాంతం వారిపై ఇతర ప్రాంతాల్లోని అధికులకి అభిమానమే…

కృష్ణా జిల్లా తెలుగంటే ప్రామాణికమైన తెలుగని, పత్రికాభాష అదేనని చెప్పుకుంటారు అక్కడి వాళ్లు. అందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏదో రకంగా తెలుగుబాషమీద అభిమానాన్ని చూపిస్తున్నందుకు ఆ ప్రాంతం వారిపై ఇతర ప్రాంతాల్లోని అధికులకి అభిమానమే తప్ప మరొక భావనేం లేదు ఇన్నాళ్లూ!

కృష్ణా జిల్లాని ఈ మధ్యనే రెండుగా చీల్చి ఒకదానికి 'ఎన్.టి.ఆర్ జిల్లా” అని పేరు పెట్టారు. 

ఎన్.టి.ఆర్ ఎంతటి తెలుగు భాషాభిమానో వేరే చెప్పక్కర్లేదు. పౌరాణిక చిత్రాల ద్వారా గానీ, తన ప్రసంగాల వల్ల గానీ తెలుగుభాషకి పెద్దపీట వేసిన గొప్ప వ్యక్తి. 

కానీ అదేంటో కానీ అదేదో జంధ్యాల సినిమాలో చెప్పినట్టు “ఏ చెవీ తట్టుకోలేని పచ్చి బూతు”, “నీచాతి నీచమైన అంక చండాలమైన బూతు”,  “బూతు బూతు బూతు” అనిపించేలా ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తోందిప్పుడు. 

ఇతర ప్రాంతాల్లోని తెలుగువారంతా “ఇదా.. కృష్ణా జిల్లా తెలుగంటే?” అని చెవుల్లో వేళ్లు దింపుకుంటున్నారు. 

కొడాలి నాని మీద కోపమేమో గానీ కృష్ణాజిల్లా తెదేపా సానుభూతిపరుల బూతుకంపుకి పక్కనున్న కృష్ణా నది ఇంకిపోయేలాగ, ప్రకాశం బ్యారేజ్ పగిలిపోయేలాగా ఉన్నాయి. కొడాలి నాని నోటిని మురుగు కాలవ అని తిడుతూ డ్రైనేజీలాంటి నోళ్లతో కుళ్లిపోయిన ఊరబూతులు కమ్మగా వల్లెవేస్తున్నారు ఈ ఉద్యమకారులు. 

తెలుగుదేశం వారి అంతర్జాతీయ బూతు సమ్మేళనానికి వేదికగా మారిపోయిందిప్పుడు కృష్ణా జిల్లా. ఎంత కంపుకొట్టే బూతు అంటే అంత కవరేజొస్తుందనో, కవరొస్తుందనో ఆకుపచ్చజెండాలు ఊపుకుంటూ అమరావతి ఉద్యమం పేరుతో రోడ్డునపడ్డ జనంలో కొందరు ప్రతిభని ప్రదర్శిస్తున్నారు. 

బహుశా వీరిలో కొందరికి బూతుపితామహ, బూతుభూషణ లాంటి బిరుదులుకూడా ఇచ్చి సత్కరిస్తారేమో తెలుగుదేశం వారు. వీరిలో స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ చురుకుగా పాల్గొనడం కృష్ణా జిల్లాకే గర్వకారణం. 

ఏది ఏమైనా కృష్ణాజిల్లావారి “కమ్మని తెలుగంటే ఇదా” అని తెలంగాణా రాష్ట్రంలోని ప్రజలు, ప్రవాసాంధ్రులు అందరూ చాగుణింతం పఠిస్తున్నారు. 

ఒక్కడన్న మాటకి ఇంతిలా రెచ్చిపోయి తమ పరువు, తమ పార్టీ పరువు, తమ జిల్లా పరువు రోడ్డుకీడ్చేసుకున్న అమాయకత్వం ఈ కమ్మనైన భాష మాట్లాడే కృష్ణాజిల్లా వారిది. 

ఇదంతా చూస్తూ కొడాలి నాని నవ్వుతూ కూర్చుంటాడే తప్ప కించిత్ కూడా భంగపడడు. ఎందుకంటే అన్నిటికీ తెగించే తన పద్ధతిలో బతుకున్నాడు. అతనికి కొత్తగా పోయే పరువేం లేదు. పోయిందల్లా తెదేపా టైరు గాలి, కృష్ణా జిల్లా తెలుగుభాష పరువు ..అంతే. ఇకపై ఎవరన్నా కృష్ణా జిల్లా తెలుగంటే…తెలుగువారికి ఈ బూతులే గుర్తొస్తాయి. 

శ్రీనివాసమూర్తి