పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగానే కనపడుతుంది, జగన్ జనరంజక బడ్జెట్ కూడా టీడీపీ బ్యాచ్ కి పచ్చగానే కనపడింది. ఏదో చేయాలి కాబట్టి విమర్శలు చేస్తున్నారు కానీ నిశితంగా పథకాల కేటాయింపులు, వాటి అవసరాలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల్ని తెలుసుకుని మాత్రం వీరు ఈ వ్యాఖ్యలు చేయడంలేదని అర్థమవుతోంది. ఆఖరికి నారా లోకేష్ కూడా బడ్జెట్ ని విమర్శిస్తున్నారంటే ఏమనుకోవాలి.
“ఆరోగ్యశ్రీకి కేటాయింపులు తగ్గించారు. కొండంత రాగం తీసి పాట పాడకుండానే కునుకేసినట్టు చేశారు. నిధులు లేని గృహనిర్మాణ పథకంతో పిచ్చుక గూళ్లు కడతారా? లబ్ధిపొందే తల్లుల సంఖ్య తగ్గించి అమ్మఒడికి కేటాయింపులు లేకుండా చేస్తారా? వడ్డీలేని రుణాలకు కేటాయింపులేవి? ” ఇది స్థూలంగా ట్విట్టర్ లో లోకేష్ పెట్టిన పోస్టింగ్ ల సారాంశం.
జగన్ ప్రకటించిన పథకాలకు ఆయన నిధులు కేటాయించలేదట, మరి టీడీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన నిరుద్యోగ భృతిలాంటి పథకాలను అసలు వారి తొలి బడ్జెట్ లో ప్రస్తావించనే లేదు. దీన్ని ఏమనాలి. బడ్జెట్ కేటాయింపుల గురించి లోకేష్ మాట్లాడితే నిజంగానే జనాలకు నవ్వొస్తుంది. కార్పొరేషన్ల పేరుతో అన్ని కులాల వారినీ మోసంచేసి, బడ్జెట్ లో నిధులు కేటాయించినా చివరికి వాటిని దారి మళ్లించి అన్ని వర్గాలనూ నిలువునా మోసంచేసిన చరిత్ర టీడీపీది.
రుణమాఫీ పేరుతో ఐదేళ్లు రైతులకు నరకం చూపిన టీడీపీ.. ఇప్పుడు వడ్డీలేని రుణాలకు తక్కువ కేటాయింపులు జరిగాయని ప్రశ్నించడం విడ్డూరు. ఐదేళ్లు ప్రజల్ని దారుణంగా వంచించిన టీడీపీ.. జగన్ తొలి బడ్జెట్ కేటాయింపులపై పెదవి విరవడం చూస్తుంటే గురివింద గింజ సామెతే గుర్తొస్తుంది. మీడియా ముందుకు వచ్చే ధైర్యం లేక, ట్విట్టర్ లో అవాకులు చెవాకులు పేలే లోకేష్ కు వీటి గురించి తెలియదా?
తమ లోపాలన్నిటినీ కప్పి పుచ్చుకుని ఎదుటివారిలో లోపాల్ని వెదకాలని చూస్తున్న టీడీపీ మేథావులు ఒక్కసారి తమ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కలు చూసుకుంటే.. జగన్ బడ్జెట్ పై కామెంట్ చేయడానికి నోరు పెగలదు. చివరికి లోకేష్ కూడా ఆర్థికవేత్తలా ట్విట్టర్ లో పోస్టులు పెడుతుంటూ.. జనాలు నవ్వుకుంటున్నారు. కొంతమంది మాత్రం అక్కడికక్కడే లోకేష్ ను కడిగిపారేస్తున్నారు.