జగన్ పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే!

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న ముందుచూపు, దార్శనికత ఇంకెవరికీ లేవు అని అంటారు చాలామంది. అయితే తండ్రిని మించిన తనయుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహానేతను మరిపించే నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఏపీలో తాగునీటి…

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న ముందుచూపు, దార్శనికత ఇంకెవరికీ లేవు అని అంటారు చాలామంది. అయితే తండ్రిని మించిన తనయుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహానేతను మరిపించే నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఏపీలో తాగునీటి కష్టాలు తీర్చేందుకు ఒక్కో ఎమ్మెల్యేకి కోటి రూపాయల నిధుల్ని కేటాయించారు జగన్.

గతంలో ఎమ్మెల్యేకి కోటి రూపాయల నియోజకవర్గ అభివృద్ధి నిధుల్ని అందజేసేవారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన తర్వాత చంద్రబాబు హయాంలో లోటు బడ్జెట్ పేరు చెప్పి ఈ నిధులకు కత్తెర వేశారు. కేవలం వైసీపీ ఎమ్మెల్యేలకు నిధులు కట్ చేసేందుకే అప్పట్లో ఆ పని చేశారు బాబు. తాజాగా నియోజకవర్గ అభివృద్ధి నిధుల పేరుతో కాకుండా.. కేవలం మంచినీటి సమస్య పరిష్కరించేందుకే కోటి రూపాయల ఫండ్ కేటాయిస్తున్నామని బడ్జెట్ సమావేశాల్లో తెలిపారు జగన్.

ఇందులో టీడీపీ, వైసీపీ అనే భేదాలు లేవు 175 నియోజకవర్గాలకు 175 కోట్లు మంచినీటి సరఫరా కోసం కేటాయించారు. ఈ సందర్భంగా సభలో “చంద్రబాబూ నీ నియోజకవర్గానికి కూడా కోటిరూపాయలిచ్చాం, మంచినీటి సమస్య పరిష్కరించండి” అంటూ చురకలంటించారు జగన్. తండ్రి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కోటి రూపాయలు కేటాయిస్తే.. తనయుడు కేవలం మంచినీటి కోసమే ఉదారంగా కోటి రూపాయలిస్తున్నారు. మిగతా అభివృద్ధి పనులకు కూడా ఇదే విధంగా కేటాయింపులుంటాయని అర్థమవుతోంది.

అంటే నియోజకవర్గ అభవృద్ధి నిధులకు జగన్ మళ్లీ పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అనుకోవాలి. వివిధ సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆయా సమస్యల పరిష్కారం కోసం ఈ నిధులు వెచ్చించేలా సూచనలు చేశారు. అంటే వృథా జరగకుండా ముందుగానే అడ్డుకట్ట వేస్తున్నారనమాట. ఇకపై రాష్ట్రంలో మంచినీటి సమస్య ఉందని ప్రతిపక్షాలు విమర్శ చేయడానికి అవకాశం లేకుండా చేశారు ముఖ్యమంత్రి.

నియోజకవర్గ ఎమ్మెల్యేకి కోటి రూపాయలిచ్చేశారు కాబట్టి, స్థానికంగా నీటి సమస్య పరిష్కారానికి ఆయనే బాధ్యుడు. ఒకవేళ సమస్య ఇంకా ఉందీ అంటే.. ఆ ఎమ్మెల్యే సరిగా పనిచేయనట్టే లెక్క. అలా కాకుండా కోటి రూపాయలతో పని జరగపోతే, అప్పుడా నియోజకవర్గానికి అదనంగా నిధులు సమకూరుస్తారు.

మొత్తమ్మీద నియోజకవర్గ సమస్యలను ఎక్కడికక్కడే ఎమ్మెల్యేలు పరిష్కరించుకునే విధంగా నిధులు కేటాయిస్తున్నారు సీఎం జగన్. అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి సమతుల్యత అంటే ఇదే.

సందీప్ చెప్పినట్లే సినిమా ఉందా? అపజయాల నుంచి బయటపడేనా?