ఏపీ సీఎం జగన్ మీద చాలా ఆశలు పెట్టుకున్న వ్యవస్థల్లో ఏపీఎస్ ఆర్టీసీ ఒకటి. గత పదేళ్లలో చార్జిలు అయితే భారీగా పెంచుతూ పోయారు కానీ.. ఆర్టీసీ మాత్రం కష్టాల నుంచి బయటపడలేదు. వైఎస్ మరణించే నాటితో పోలిస్తే.. ఇప్పటి వరకూ ఏపీఎస్ ఆర్టీసీ చార్జిలు దాదాపు అన్నీ రెట్టింపుకు మించిన స్థాయికి పెరిగాయి.
వైఎస్ హయాంలో నలభై కిలోమీటర్ల దూరం ప్రయాణానికి గానూ టికెట్ ధర దాదాపు 19 రూపాయలు ఉండేది. ఇప్పుడే అదే ఎక్స్ ప్రెస్ టికెట్ 45 రూపాయల స్థాయికి పెరిగింది. ఇంధన ధరలు ఏమీ అలా రెట్టింపు స్థాయికి పెరగలేదు. కానీ టికెట్ ధరలు మాత్రం రెట్టింపుకు మించిన స్థాయికి చేరాయి.
అలా టికెట్ల ధరలు భారీగా పెరిగినా అదే స్థాయిలో నష్టాలు కూడా పెరగడం గమనార్హం. చంద్రబాబు హయాంలో ఆర్టీసీ నష్టాలకు అంతేలేదు. గత నాలుగేళ్లలో ఆర్టీసీ ప్రతియేటా వెయ్యి కోట్ల రూపాయల మేర నష్టపోయిందట! అత్యంత సమర్థ పాలకుడు అనే చంద్రబాబు హయాంలో ఆర్టీసీకి అలాంటి నష్టాలు సంభించినట్టుగా రవాణాశాఖ గణాంకాలే చెబుతున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ విలీనానికి చర్యలు చేపట్టారు. బడ్జెట్ లో కూడా అందుకు సంబంధించి కేటాయింపులు జరిగాయి. 1,572 కోట్ల రూపాయలను ఆర్టీసీ కోసం కేటాయించారు ఏపీ బడ్జెట్లో.
ఆర్టీసీకి తక్షణ ఆర్థికసాయం కింద వెయ్యి కోట్ల రూపాయలు, రాయితీలకు ఐదువందల కోట్లు, కొత్త బస్సులకు యాభై కోట్ల రూపాయల మొత్తాన్ని జగన్ ప్రభుత్వం కేటాయించింది. ఇక నుంచి అయినా ఆర్టీసీ కోలుకుంటుదని ఆశించాలి.