మొన్నటివరకూ ఏ పార్టీకి ఓటేసినా బీజేపీకి పడుతోందని ఆ పార్టీ వైరిపక్షాలు గగ్గోలు పెట్టాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ ఆరోపణలు చేశాయి. ఆ ఆరోపణలను సామాన్య ప్రజలే విశ్వసించలేదు. ఏ పార్టీకి ఓటేసినా బీజేపీకి పడటం మాటేమిటో కానీ.. ఏ పార్టీ తరఫున నెగ్గినా బీజేపీలోకి నేతలు చేరిపోవడం మాత్రం జరుగుతూ ఉంది.
ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి రాజకీయం సాగుతూ ఉండటం గమనార్హం. కమలం పార్టీ గట్టిగా ఉన్నచోట మాత్రమే కాకుండా, ఏపీ వంటి రాష్ట్రాల్లో కూడా అలాంటి ఫిరాయింపులు జరుగుతూ ఉండటం గమనార్హం. ఆ ఫిరాయింపులకు బీజేపీ గర్వపడుతూ ఉంది. నిత్యం విలువల గురించిమాట్లాడే ఆ పార్టీ అనైతిక రాజకీయాన్ని ప్రోత్సహిస్తూ ఉంది.
ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ఇలాంటి రాజకీయాలు సాగుతూ ఉన్నాయి. ఇటీవలే ఏపీలో నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీల విలీనం చేసేసుకుంది! ఇక కర్ణాటకలో రచ్చవెనుక కమలం పార్టీ ఉందనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అక్కడ అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని బీజేపీ ఎదురుచూస్తున్నదైతే నిజం.
ఇక గోవాలో ఏకంగా ముగ్గురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ ప్రభుత్వంలో మంత్రి పదవులు దక్కాయక్కడ. ఈ రాష్ట్రాల్లో మాత్రమేకాదట.. మధ్యప్రదేశ్, రాజస్తాన్ లలో కూడా తదుపరి రాజకీయం ఇదేనని కమలనాథులు లీకులు ఇస్తున్నారు.
ఆ రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్యేల ఫిరాయింపులు, ప్రభుత్వాలను పడగొట్టడాలు ఉంటాయని సూఛాయగా చెబుతూ ఉన్నారు. మొత్తానికి తమకు ఏ రకంగానూ ఎదురులేదనే లెక్కలతో బీజేపీ ఇలా తెగిస్తున్నట్టుగా ఉందని పరిశీలకులు అంటున్నారు.