ఏపీలో ఆగస్ట్ 16 నుంచి స్కూల్క్ తెరుచుకుంటాయా..?

దేశవ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలు తెరిచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయం అంటూ కేంద్రం చేతులు దులిపేసుకుంది. కరోనా కేసులు తగ్గడంతో ఏపీ సహా చాలా చోట్ల డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీల్లో పరీక్షల వ్యవహారం…

దేశవ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలు తెరిచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయం అంటూ కేంద్రం చేతులు దులిపేసుకుంది. కరోనా కేసులు తగ్గడంతో ఏపీ సహా చాలా చోట్ల డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీల్లో పరీక్షల వ్యవహారం జోరందుకుంది. ఇక స్కూల్స్ విషయానికొస్తే పిల్లలకు ఎలాగూ వ్యాక్సిన్ అందుబాటులో లేదు కాబట్టి, టీచర్లందరికీ టీకాలు ఇచ్చి ఆ తర్వతా తరగతి గది బోధన మొదలు పెడతామని చెబుతున్నాయి ప్రభుత్వాలు. 

ఏపీలో ఆ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఆల్రడీ టీచర్ల వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఆగస్ట్ 15నాటికి ఉపాధ్యాయులందరికీ టీకా పంపిణీ పూర్తి చేసి ఆగస్ట్ 16 నుంచి తరగతి గది బోధన మొదలు పెట్టాలని ఏపీ సర్కారు భావిస్తోంది.

ప్రస్తుత పరిస్థితి ఏంటి..?

ఏపీలో కేసుల సంఖ్య పెరగడం లేదు కానీ.. సాక్షాత్తూ డిప్యూటీ సీఎం కరోనా బారిన పడటంతో కలకలం రేగింది. కొన్ని జిల్లాల్లో కంటైన్మెంట్ జోన్లను కొనసాగిస్తూ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. అటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. హైదరాబాద్ లో కొవిడ్ తో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతున్నట్టు తెలుస్తోంది. గాంధీ ఆస్పత్రికి రోజుకి 30 మందికి పైగా కరోనా రోగులు ఇన్ పేషెంట్లుగా చేరేందుకు వస్తున్నారు.

ఈ దశలో ఏపీ కూడా అప్రమత్తం అయింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఆక్సిజన్ అందుబాటులో ఉంచుకోండి, మౌలిక వసతుల కల్పనపై నిర్లక్ష్యం చేయొద్దంటూ తాజాగా సీఎం జగన్, అధికారులను ఆదేశించారు. ఈ సమయంలో ఏపీలో అనుకున్న టైమ్ కి స్కూల్స్ రీఓపెన్ అవుతాయా లేదా అనేది అనుమానంగా మారింది.

తల్లిదండ్రుల అభిప్రాయం ఏంటి..?

లోకల్ సర్కిల్స్ అనే ఆన్ లైన్ సంస్థ దేశవ్యాప్తంగా చేపట్టిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 361 జిల్లాల్లో 32వేలమంది తల్లిదండ్రులపై ఈ సర్వే జరిగింది. వీరిలో 48శాతం మంది పేరెంట్స్, తమ పిల్లలను స్కూల్స్ కి పంపేందుకు ఇష్టపడటం లేదు. 21శాతం మంది మాత్రం స్కూల్స్ ఎప్పుడు తెరిస్తే, అప్పుడు పిల్లల్ని పంపించేందుకు రెడీగా ఉన్నారట. 

కేవలం టీచర్లకు మాత్రమే కాదు, పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ పూర్తి చేసిన తర్వాత స్కూల్స్ తెరిస్తే బాగుంటుందనేది మెజార్టీ పేరెంట్స్ అభిప్రాయం. ప్రస్తుతం భారత్ లో చిన్నారుల వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. త్వరలో కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకోబోతోంది. 

చిన్నారుల వ్యాక్సినేషన్ కూడా పూర్తయిన తర్వాతే స్కూల్స్ అంటే.. కచ్చితంగా ఈ విద్యాసంవత్సరంలో అది సాధ్యం కాకపోవచ్చు. మరోవైపు కేరళలో కేసుల పెరుగుదల, మూడో వేవ్ భయాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్కూల్స్ తెరిచే విషయంలో పునరాలోచించే అవకాశముందని విద్యారంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.