ప్రతిపక్షాల విమర్శలను కాసేపు పక్కనపెడదాం.. చంద్రబాబు హయాంలో చేసిన అప్పుల్ని, ఆయన చేసిన దుబారాని కాసేపు మరచిపోదాం. మరో రెండు రోజుల్లో ఒకటో తేదీ వస్తోంది. ఏపీలో సామాజిక పింఛన్లు తీసుకునేవారికి ఒకటో తేదీ ఠంచనుగా ఆర్థిక సాయం అందుతుందన్న భరోసా ఉంది. మరి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆ మేరకు ధైర్యం ఉందా.
ఒకటో తేదీ తాము జీతం డ్రా చేసుకుంటామనే నమ్మకం వారిలో ఉందా. పోనీ ప్రభుత్వ ఉద్యోగులుగా పదవీ విరమణ చేసిన వారు తమకు వచ్చే పింఛన్ ఒకటో తేదీనే తీసుకుంటారనే హామీ ఎవరైనా ఇవ్వగలరా..? అసలు దీనంతటికీ కారణం ఎవరు..?
ఉద్యోగులకు ఒకటో తేదీ ఇస్తారా..?
ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, పథకాల అమలు, రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాలకు ప్రతి నెలా 10వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ఓ అంచనా. ఇప్పటికిప్పుడు ఆమేర నిధులు ప్రభుత్వం వద్ద లేవు. జీతాల కోసం కచ్చితంగా అప్పు చేయాల్సిన పరిస్థితి. మరోవైపు ఇప్పటికే ఓవర్ డ్రాఫ్ట్ కి వెళ్లిపోయారని, ఇకపై అప్పు పుట్టదని వార్తలొస్తున్నాయి. మరి ఈ ఒకటో తేదీ అయినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందుతాయా లేదా..?
పరిమితికి మించి అప్పుచేస్తున్నారనేది కేవలం ఆరోపణ కాదు, పేపర్ పై ఉన్న నిజం. రాజ్యసభలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి కూడా ఇదే విషయంపై వివరణ ఇచ్చారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఏపీ ప్రభుత్వం తీసుకోవాల్సిన దానికంటే అదనంగా రుణం తీసుకుందని తెలుస్తోంది.
ఆ అప్పు విలువ రూ.4872కోట్లు అని తేలింది. మరి దీనికి ఆర్థిక మంత్రి బుగ్గన ఏమని సమాధానం చెబుతారు. పయ్యావుల కేశవ్ ఆరోపణలు తేలిగ్గా కొట్టిపారేయొచ్చు కానీ, కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి చెప్పిన మాటల్ని తప్పుబట్టలేం కదా?
పంచుకోవడమే కాదు, పెంచుకోవాలి కూడా..?
కరోనా కష్టకాలంలో అన్ని రాష్ట్రాలను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. అయితే ఎక్కడా ఏపీలో ఉన్నన్ని పథకాలు లేవు కాబట్టి, పెద్దగా ప్రభావం లేకపోయింది. కానీ ఏపీ మాత్రం అప్పులతో సతమతం అవుతోంది. మంచి ప్రభుత్వం అనిపించుకుంటే సరిపోదు, అప్పుల్లో ముంచిన ప్రభుత్వం అని కూడా అపవాదు రాకుండా చూసుకోవాలి. అప్పుడే జగన్ కి, చంద్రబాబుకి తేడా ఉంటుంది.
పథకాల పేరుతో పంచుకునే సందర్భంలో.. ఆదాయన్ని పెంచుకునే మార్గాల్ని కూడా ప్రభుత్వం అన్వేషించాల్సి ఉంది. అప్పుడే ఇలాంటి అప్పుల తిప్పలు తప్పుతాయి. ఈ దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారని ఆశిద్దాం.