మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిసి మాట్లాడ్తారో లేక తెలియకే అంటారో అర్థం కావడం లేదు. అచ్చెన్న మాటలు వింటే మాత్రం జనాలు నవ్వుకోకుండా ఉండలేరు. రైతులైతే వెంటపడతారు. అజ్ఞానాన్ని ప్రదర్శించుకోవాలన్నా చాలా ధైర్యం కావాలి.
ఎందుకంటే ఇలా మాట్లాడితే జనం ఏమనుకుంటారోననే స్పృహ లేని వాళ్లు మాత్రమే కొన్నికొన్ని విడ్డూరపు ప్రసంగాలు చేస్తుంటారు. అలాంటి జాబితాలో అచ్చెన్నాయుడు చేరిపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ధాన్యం బకాయిల చెల్లింపులకు సంబంధించి జగన్ ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు. రైతులకు జరిగిన వడ్డీ నష్టాన్ని ప్రభుత్వమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ధాన్యం బకాయిలు విడుదల చేయడంలో జగన్రెడ్డి నెలలు తరబడి ఆలస్యం చేశారని ఆయన విమర్శలు చేశారు. అంతటితో ఆయన ఊరికే ఉంటే గౌరవం దక్కేది. కానీ తమ పాలనలోకి వెళ్లి గొప్పలు చెప్పుకున్నారు.
గత ప్రభుత్వం వలే రైతు రుణమాఫీ చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేసి జనం దృష్టిలో అభాసుపాలు అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవినీతి, దుబారా అరికడితే రైతు రుణమాఫీ కూడా సాధ్యమే అని అచ్చెన్నాయుడు చెప్పడం వింతల్లో కెల్లా వింత అని నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు. చంద్రబాబు హయాంలో చెప్పిన మాట ప్రకారం రైతుల రుణమాఫీ చేయని విషయం చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు.
అలాంటిది తమ పాలనలో వలే రుణమాఫీ చేయాలని అచ్చెన్న కోరడం అంటే… రైతులను మభ్య పెట్టాలని చెప్పడమేనా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతా నారా లోకేశ్ ప్రభావం అని కొందరు కామెంట్స్ చేస్తుండడం విశేషం. మరికొందరు తమ పాలనలోని రైతుల రుణమాఫీ గురించి జనానికి వినిపించేలా గట్టిగా అనొద్దయ్యా సామి అని హితవు చెప్పడం గమనార్హం.