విశ్వాస పరీక్షకు సై అని అంటున్నారు కుమారస్వామి. వారంరోజుల నుంచి రచ్చగా మారిన కర్ణాటక రాజకీయం ఎడ తెగకుండా కొనసాగుతూ ఉంది. ఎమ్మెల్యేల రాజీనామాలపై కూడా ప్రతిష్టంభన కొనసాగుతూ ఉంది. వారి రాజీనామాలను ఆమోదించడం కానీ, వారిపై అనర్హత వేటు వేయడం కానీ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.
దీంతో కర్ణాటక రాజకీయం ఏమవుతుందో అంతుబట్టని రీతిలో సాగుతూ ఉంది. మరోవైపు తాము విశ్వాస పరీక్షను ఎదుర్కొనడానికి రెడీగా ఉన్నట్టుగా కుమారస్వామి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు సై అని అంటోంది. అదంతా మేకపోతు గాంభీర్యమా? అనే సందేహాలూ నెలకొని ఉన్నాయి.
అయితే కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు కుమారస్వామితో టచ్లో ఉన్నారని, విశ్వాస పరీక్ష ఓటింగ్ వరకూ వెళ్లిన పక్షంలో బీజేపీ నుంచి ఎమ్మెల్యేలు వచ్చి కుమారస్వామికి మద్దతు పలుకుతారనే వదంతులు వినిపిస్తూ ఉన్నాయి. అయితే కమలం పార్టీ తన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని స్థితిలో ఉంటుందని ఎవరూ అనుకోలేరు.
ప్రస్తుతానికి అక్కడ రిసార్ట్ రాజకీయాలు కొనసాగుతూ ఉన్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి క్యాంపులను నిర్వహిస్తూ ఉంది. కాంగ్రెస్ –జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ కథ అయిపోయింది అనేది ప్రాథమికంగా అర్థం అవుతున్న విషయం. ఇటీవల ఆ పార్టీల లెజిస్లేటివ్ విభాగాల మీటింగుకు చాలామంది ఎమ్మెల్యేలు మొహం చాటేశారు.
ఈ పరిస్థితుల్లో విశ్వాస పరీక్ష జరిగితే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమనే అంచనాలున్నాయి. కాంగ్రెస్, కుమారస్వామిలు మాత్రం పైకి చాలా విశ్వాసంగా కనిపిస్తూ ఉన్నారు. డీకే శివకుమార చక్రం అడ్డేస్తాడని ప్రభుత్వాన్ని కాపాడతాడని కాంగ్రెస్ వాళ్లు కాన్ఫిడెన్స్ తో ఉన్నారట!