కరోనా ప్రతాపం వృద్ధుల మీదే ఎక్కువ అని మొదటి నుంచి అనేక మంది చెబుతూ ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా చేత మరణించిన వాళ్లలో కూడా 60 యేళ్లు, అంతకు మించిన వయసు వారే ఎక్కువ మంది. కరోనా చేత తీవ్రంగా బాధింపబడిన దేశం ఇటలీ. అక్కడ వృద్ధుల సంఖ్య ఎక్కువ కావడంతో, అక్కడ కరోనా వైరస్ బారిన పడిన వారిలో మరణాల రేటు ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతూ ఉన్నారు.
ఈ క్రమంలో 60 దాటిన వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తూ ఉన్నారు. అలాంటి వారికి కరోసా సోకితే ప్రమాదకరమని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. వారిలో వ్యాధినిరోధకత తక్కువని వివరిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో భారతదేశంలో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా 60 దాటిన వారికి కొత్త ఆంక్షలు పెడుతున్నాయి. ఇప్పుడు కూడా 60-65 వయసు దాటిన వారు ఎప్పుడంటే అప్పుడు ఇళ్ల నుంచి బయటకు రావడానికి వీల్లేదనే ఆంక్షలున్నాయి. నాలుగో దశ లాక్ డౌన్లో కూడా ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు.
ఈ క్రమంలో బాగా ఇబ్బంది పడేది రాజకీయ నేతలే అని స్పష్టం అవుతోంది. సామాన్యుల్లో 60-65 దాటిన వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారు బయటకు వచ్చినా .. ఏదో వాళ్ల పని చూసుకుంటూ వెళ్లిపోతూ ఉంటారు. కానీ లాక్ డౌన్ నియామవళిని రాజకీయ నేతలు స్ట్రిక్ట్ గా పాటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇప్పుడప్పుడే హైదరాబాద్ లోని తన ఇంటి నుంచి బయటకు వచ్చి, కనీసం ఏపీ వరకూ ప్రయాణించే అవకాశాలు కూడా లేవని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.
ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలనుకునే వాళ్లు ఇప్పుడు వెళ్లొచ్చు. అయితే 14 రోజుల పాటు ఇనిస్టిట్యూషనల్ క్వారెంటైన్లో ఉండాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఏపీకి వచ్చే అవకాశాలు లేనట్టే. ఒకవేళ ఈ మినహాయింపును కూడా త్వరలోనే సడలించినా, వయసు రీత్యా చంద్రబాబునాయుడు ఇప్పుడప్పుడే రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశాలు తక్కువనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి కూడా ట్వీట్ చేశారు.
'కరోనా మనతోటే ఉంటుంది కాబట్టి 65 ఏళ్లు దాటినోళ్లు బయటకు రావద్దని కేసీఆర్ గారు కూడా చెప్పారు. జాగ్రత్త బాబూ! నీకు 71 ఏళ్లు అని వైరస్ ఇట్టే పసిగడ్తుంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు సీఎం, ప్రతిపక్ష నేతగా పదకొండేళ్లు లాంటివి కరోనాకు అర్థం కావు…' అంటూ ఆయన ట్వీట్ చేశారు.