కరోనా లాక్ డౌన్ తో దేశవ్యాప్తంగా మోడీ ప్రతిష్ట మంటగలిసింది. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటనతో ఉన్న పరువు కూడా పోయింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దేశవ్యాప్తంగా బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఆ అవకాశం లేదు కాబట్టి ప్రభుత్వానికొచ్చిన నష్టమేం లేదు. మరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి కదా. పెద్దాయన అప్పుడేం చేస్తారు? వాయిదా మంత్రం పఠిస్తారా, లేక ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కుంటారా అనే సందేహాలున్నాయి.
అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది చివరికల్లా బీహార్ లో ఎన్నికలు జరగాలి. ప్రస్తుతానికి అక్కడ జేడీయూ, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉన్నా.. బీజేపీ క్రేజ్ తగ్గడంతో జేడీయూ ఒంటరిగా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే అది మోడీ-షా ద్వయానికి గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి.
వచ్చే ఏడాది అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలున్నాయి. ప్రస్తుతం అసోంలో బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ వివాదాల నేపథ్యంలో అసోంలో పరిస్థితి ఈసారి కమలదళానికి కలిసొచ్చేలా లేదు. కేరళలో ఎల్డీఎఫ్ కూటమే తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశముంది. లాక్ డౌన్ అమలు, లాక్ డౌన్ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అక్కడ కరోనా ముందుగానే అదుపులోకి వచ్చింది. స్థానిక ప్రభుత్వం దీన్ని తమ విజయంగానే చెప్పుకుంటోంది కూడా.
ఇక తమిళనాడులో ఇద్దరు మహామహుల మరణం తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలివి. జయలలిత, కరుణానిధి లేకపోవడంతో అక్కడ బీజేపీ పాగా వేయాలని చూస్తోంది, రజినీకాంత్ ని దువ్వుతోంది. కానీ కరుణానిధి వారసుడు స్టాలిన్ ఈసారి బలంగా కనిపిస్తున్నారు. కమల్ హాసన్, విజయ్ కాంత్ లెక్కలోకి వచ్చే అవకాశాల్లేవు.
పశ్చిమబెంగాల్ లో బీజేపీ పరిస్థితి మరీ దారుణంగా కనిపిస్తోంది. లోక్ సభ ఫలితాలతో బెంగాల్ లో పాగా వేయాలనుకున్న బీజేపీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఖంగుతింది. మమత పూర్తిగా కొరకరాని కొయ్యలా మారిపోయారు. బీజేపీని నిర్వీర్యం చేసే దిశగా ఆమె అడుగులు వేసింది. తాజా లాక్ డౌన్ తో కేంద్రంతో కయ్యానికి దిగిన స్థానిక ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైంది. అక్కడ కూడా బీజేపీ పప్పులు ఉడికేలా కనిపించట్లేదు.
వాస్తవానికి జమ్మూకాశ్మీర్ లో కూడా వచ్చే ఏడాది ఎన్నికలు జరగాలి కానీ, రాష్ట్ర విభజనతో ఆ ప్రక్రియ అంతా గందరగోళంగా ఉంది. ఇక 2022లో బీజేపీ చేతిలోని గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. లాక్ డౌన్ ఎఫెక్ట్ అప్పటికి పోతుందనుకున్నా.. బీజేపీ స్థానిక ప్రభుత్వాల పనితీరు ఏమంత బాగాలేదని సర్వేలు చెబుతున్నాయి.
మొత్తమ్మీద.. రాబోయే రెండేళ్లు బీజేపీ ఎన్నికలను కాచుకోవాల్సి ఉంది. కరోనా పేరు చెప్పి ఎన్నికలను వాయిదా వేయడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రపతి పాలనతో కొన్నాళ్లు నెట్టుకు రావాలనేది మోడీ ఆలోచన. మరి ఆ తర్వాతైనా ఆయన ఎన్నికలను ఎదుర్కోక తప్పని పరిస్థితి. అప్పటికి బడుగు బలహీన వర్గాలు, వలస కూలీల్లో బీజేపీ ప్రభుత్వంపై కోపం పోయేలా ఏదో ఒక మాయచేసి ఎన్నికల రణరంగంలో దిగాలనేది మోడీ ప్లాన్.