యాంక‌ర్‌ను చిత‌క్కొట్టాడు

త‌మ ఆలోచ‌న‌లు, ఇష్టాయిష్టాల‌ను పంచుకోడానికి ప్ర‌తి ఒక్క‌రికీ సోష‌ల్ మీడియా ఓ పెద్ద వేదికైంది. చేతిలో కెమెరా వుంటే చాలు… ఏదైనా చేయొచ్చ‌నే కాలం ఒక‌టి ప్ర‌స్తుతం న‌డుస్తోంది. మ‌రీ ముఖ్యంగా కుర్ర‌కారు ప్రాంక్…

త‌మ ఆలోచ‌న‌లు, ఇష్టాయిష్టాల‌ను పంచుకోడానికి ప్ర‌తి ఒక్క‌రికీ సోష‌ల్ మీడియా ఓ పెద్ద వేదికైంది. చేతిలో కెమెరా వుంటే చాలు… ఏదైనా చేయొచ్చ‌నే కాలం ఒక‌టి ప్ర‌స్తుతం న‌డుస్తోంది. మ‌రీ ముఖ్యంగా కుర్ర‌కారు ప్రాంక్ వీడియోల పేరుతో కామెడీని యూట్యూబ్ వేదిక‌గా పండిస్తున్నారు. ఒక్కో సారి కామెడీ శృతి మించి ట్రాజెడీ చోటు చేసుకుంటున్న సంద‌ర్భాలు లేక‌పోలేదు.

ఈ వాస్త‌వాన్ని ప్రాంక్‌గా ఒప్పుకుని తీరాల్సిందే. ప్రాంక్ వీడియో చేసే క్ర‌మంలో త‌మాషా కాస్తా సీరియ‌స్ అయ్యింది. చివ‌రికి షాపు య‌జ‌మాని చేతిలో స‌ద‌రు యూట్యూబ్ చాన‌ల్ యాంక‌ర్ చావు దెబ్బ‌లు తినాల్సి వ‌చ్చింది. న‌వ్వు తెప్పించే ఈ సీరియ‌స్ ఉదంతం ప్ర‌తి యూట్యూబ‌ర్‌కు ఓ గుణ‌పాఠంగా నిలిచే వైనం గురించి తెలుసుకుందాం.

హైద‌రాబాద్‌కు చెందిన ఓ యువ‌కుడు ఓ కామెడీ చాన‌ల్ న‌డుపుతున్నాడు. ఇందులో ప్రాంక్ వీడియోలు పెడుతూ వీక్షకుల‌కు న‌వ్వులు పంచుతుంటాడు. ఇదే సంద‌ర్భంలో వివిధ అంశాల‌పై జ‌నాన్ని చైత‌న్య‌ప‌రిచే వీడియోలు కూడా పెడుతుంటాడు. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ అబిడ్స్‌లోని జ‌గ‌దీష్ మార్కెట్‌లోని ఓ మొబైల్ షాప్‌న‌కు స‌ద‌రు యాంక‌ర్ వెళ్లారు. ప్రాంక్ వీడియో పేరుతో షాపు యాజ‌మానితో గొడ‌వ‌కు దిగాడు.

అయితే షాపు య‌జ‌మాని మాత్రం నిజంగానే క‌స్ట‌మ‌ర్ గొడ‌వ‌కు దిగాడ‌ని భావించాడు. ఇద్ద‌రి మ‌ధ్య వాద‌న పెరిగింది. ఇది అంత‌కంత‌కూ పెరిగి పెద్ద‌దైంది. స‌ద‌రు మొబైల్ షాప్ య‌జ‌మాని తీవ్ర ఆవేశానికి లోన‌య్యాడు. ప్రాంక్ వీడియో అని చెప్పినా వినిపించుకోలేదు. 

యాంక‌ర్‌ను చిత‌క్కొట్టాడు. ఈ విష‌యం తెలిసి అబిడ్స్ పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. ఇద్ద‌ర్నీ పోలీస్‌స్టేష‌న్‌కు తీసుకెళ్లి త‌మ‌దైన రీతిలో మ‌ర్యాదు చేసిన‌ట్టు స‌మాచారం. మొత్తానికి ప్రాంక్ వీడియో సంగ‌తేమో గానీ, జీవిత కాలం గుర్తుండిపోయేలా యాంక‌ర్‌కు అనుభ‌వం మిగిలింద‌నే వ్యంగ్య కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.