టోక్యో ఒలింపిక్స్ లో భారత బృందానికి గురువారం కాస్త సానుకూల ఫలితాలు వచ్చాయి. నాలుగు విభాగాల్లో అథ్లెట్లు పతకం వేటలో ముందజ వేశారు. ఇప్పటి వరకూ ఇండియా ఖాతాలో ఒకే ఒక రజత పతకం ఉంది ఈ సారి. ఇప్పుడు పతకాలపై ఆశలను పెంచుతూ నాలుగు విభాగాల్లో సానుకూలమైన ఫలితాలు వచ్చాయి.
ముందుగా హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్ కు చేరింది. పటిష్టమైన అర్జెంటీనాపై విజయం సాధించి టీమిండియా ముందడుగు వేయడం గమనార్హం. క్వార్టర్స్ లో గెలిచి, సెమిస్ లో నెగ్గితే ఇండియాకు సుదీర్ఘ కాలం తర్వాత హాకీలో పతకం వచ్చే అవకాశం ఉంది. కనీసం మూడో స్థానంలో నిలిచినా ఒక పతకం అయితే గ్యారెంటీ. అయితే స్వర్ణపతాకం గెలుపుకు భారత హాకీ జట్టు మూడే విజయాల దూరంలో ఉంది. మూడు విజయాలు సాధ్యం అయితే అద్భుతం సాకారమైనట్టే.
ఇక పీవీ సింధూ కూడా క్వార్టర్ ఫైనల్ కు ఎంట్రీ ఇచ్చింది. బ్యాడ్మింటన్ ఉమెన్ సింగిల్స్ లో సింధూ క్వార్టర్స్ కు చేరి పతకంపై ఆశలను మరింత పెంచింది. తన కెరీర్ లో రెండో ఒలింపిక్ మెడల్ సాధించి అద్భుతం చేసే దిశగా సింధూ సాగుతూ ఉంది.
బాక్సింగ్ సూపర్ హెవీ వెయిట్ విభాగంలో సతీష్ కుమార్ ముందజ వేశాడు. క్వార్టర్స్ లో చేరాడు సతీష్ కుమార్. బాక్సింగ్ కు సంబంధించి మరో సానుకూలాంశం ఏమిటంటే కనీసం సెమిస్ కు చేరినా పతకం గ్యారెంటీ. సెమిస్ లో ఓడిన ఇద్దరికీ మెడల్ ఇస్తారు. కాబట్టి సతీష్ కుమార్ పతకానికి కేవలం ఒక్క విజయం దూరంలో ఉన్నాడు.
ఇక ఆర్చరీలో అతానూ దాస్ రౌండ్ ఆఫ్ 16కు చేరాడు. మెన్స్ వ్యక్తిగత విభాగంలో అతానూ 16 మంది జాబితాలోకి చేరాడు. అయితే పతకానికి ఇంకా సుదూరంలో ఉన్నట్టే.
ఇవి గురువారం భారత్ కు సానుకూలంగా వచ్చిన ఫలితాలు. ఈ నాలుగు విభాగాల్లోనూ భారత అథ్లెట్లు ముందంజ వేసి పతకాలను సాధించే అవకాశాలు మెరుగ్గానే కనిపిస్తున్నాయి.